అదృష్టమంటే ఇదే…పుట్టకతోనే బంపర్
అప్పుడే పుట్టిన పాపాయికి చిరకాలం గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చింది ఓ రెస్టారెంట్. ఆమె జీవితాంతం అక్కడ ఉచితంగా భోజనం చేసే అవకాశం కల్పించింది. అంతేకాదు పెద్దయ్యాక ఉద్యోగం కోసం వెతుక్కునే పనిలేకుండా, ఆసక్తి ఉంటే ఉద్యోగం చేసే అవకాశం కూడా ఇచ్చింది. అదృష్టమంటే ఆమెదేననిపిస్తోందా? ఇవన్నీ ఎందుకో తెలుసా? ఆ చిట్టితల్లి ఆ రెస్టారెంట్లోనే పుట్టింది. ఈ బంపర్ ఆఫర్ల వెనక అసలు కథ ఇదీ.
ఈ నెల 17న టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియోలో ఉన్న చిక్ ఫిల్ ఎ రెస్టారెంట్‌కు రాబర్ట్ గ్రీఫిన్, మ్యాగీ దంపతులు వచ్చారు. వీరికి ఇద్దరు పిల్లలు. అదే సమయంలో మ్యాగీకి పురిటి నొప్పులు రావడంతో రెస్ట్ రూమ్‌కు వెళ్లారు. తన స్నేహితుడు కారులో పిల్లలను ఇంటికి పంపించిన రాబర్ట్, రెస్ట్ రూమ్‌లో భార్యపక్కనే ఉండి సపర్యలు చేశాడు. పండంటి పాపాయికి జన్మనిచ్చింది మ్యాగీ. దీంతో ఆ ఇద్దరి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఆ తర్వాత వచ్చిన ఎమర్జెన్సీ వెహికిల్‌లో హాస్పిటల్‌కు వెళ్లారు. ఈ విషయాన్ని రాబర్ట్ తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేయడంతో, విపరీతంగా వైరల్ అయ్యింది. లక్షల మంది ఆ తల్లీపిల్లలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకూ ఆ చిట్టాయి పేరు చెప్పలేదు కదూ. గ్రేస్లిన్ మాయి వయలెట్ గ్రిఫిన్. మరోవైపు రెస్టారెంట్ యాజమన్యం కూడా ఈ విషయమై స్పందించింది. తాము ఫుడ్ డెలివరీయే కాదని, పట్టిన బిడ్డలకు సహాయసహకారాలు కూడా అందిస్తుంటామని తన అధికారిక ఫేస్ బక్ పేజీలో తెలిపింది. ఈ వార్త వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఆ చిట్టి తల్లి ఫొటోలకు బోలెడు షేర్లు, లైకులు వస్తున్నాయి.













