కరోనా వైరస్ టెస్టుల్లో జాప్యం…ప్రమాదమేనా?
కరోనా వైరస్ పాజిటీవ్ రోగులకు సంబంధించిన పరిక్షల నిర్వహణలో అసాధారణ జాప్యం కారణంగా వైరస్ ఇతరులకు సోకే ప్రమాదం ఉందని పలువురు నిపుణులు భారత ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్ టెస్టుల సమాచార వెల్లడిలో భారత ప్రభుత్వం ఖచ్చితమైన ప్రామాణికాలు పాటిస్తోంది. అయితే ఇలా వెల్లడి చేస్తున్న సంఖ్యపై పలు సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుక్కారణం భారత్‌లో నిర్వహిస్తున్న పరీక్షల సంఖ్యే. కరోనా వైరస్ గుర్తింపు పక్రియలో పరీక్షల నిర్వహణ అత్యంత కీలకమైన అంశం. లక్షణాలు బహిర్గతం కావడానికి రెండు నుంచి 14రోజుల సమయం పట్టొచ్చు. కానీ పరీక్ష నిర్వహణ ద్వారానే రోగిని అప్పటికప్పుడు ఖచ్చితంగా గుర్తించే వెసులుబాటుంటుంది. తద్వారా సోకిన వ్యక్తుల సామాజిక కదలికల్ని నిరోధించొచ్చు. వ్యాధి సంక్రమణ వ్యాప్తిని అరికట్టొచ్చు.
అయితే పరీక్షలకు సంబంధించి ఒక్కో దేశం ఒక్కో విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఒక్కొక్క దేశం ఒక్కో రకమైన హేతుబద్దతను, పరీక్షా వ్యూహాల్ని పాటిస్తున్నాయి. వ్యాధి అనుమానితులందరికీ కొన్ని దేశాలు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. కానీ భారత్ పరీక్షల నిర్వహణకు కొన్ని ప్రమాణాలు నిర్దేశించింది. 134కోట్ల జనాభా ఉన్న భారత్‌లో జనాభాతో పోలిస్తే నిర్వహిస్తున్న పరీక్షల సంఖ్య అత్యల్పంగా ఉంది.
ప్రపంచ వ్యాప్తంగా పరీక్షల నిర్వహణ పక్రియను మిలియన్ జనాభా ప్రాతిపదికన లెక్కిస్తారు. అలా చూస్తే ప్రపంచంలోనే నార్వే ఈ విషయంలో తొలి స్థానంలో ఉంది. ఆ దేశం ప్రతి పదిలక్షల మంది జనాభాకు 15,386మందికి పరీక్షలు నిర్వహించింది. రెండో స్థానంలో యునైటెడ్ అరబ్ఎమిరెట్స్ ఉంది. ప్రతి మిలియన్‌కు 13,022 పరీక్షలు జరపగా మూడోస్థానం లోఉన్న స్విట్జర్లాండ్ 12,369 పరీక్షలు చేసింది. 9,032పరీక్షల్తో ఆస్ట్రేలియా నాలుగో స్థానంలో, 7,622 పరీక్షల్తో దక్షిణ కొరియా ఐదోస్థానంలో నిల్చాయి. తర్వాత స్థానాల్లో వరుసగా స్పెయిన్, ఇటలీ, జర్మనీ, కెనడా, తదితర దేశాలున్నాయి. కాగా భారత్‌లో ప్రతి మిలియన్ జనాభాకు సగటున 20పరీక్షలు మాత్రమే నిర్వహించారు. ఈ విషయంలో 23పరీక్షల్తో పిలిప్పీన్స్, 34పరీక్షల్తో మెక్సికో, 62పరీక్షల్తో పాకిస్థాన్, 126పరీక్షల్తో దక్షిణాఫ్రికాలు భారత్‌కంటే ముందున్నాయి.
ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 202 దేశాల్లో కోవిడ్ 19 వ్యాధిగ్రస్తులు సుమారు ఏడులక్షలకు చేరుకున్నారు. గత కొన్ని రోజులుగా వీరి సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ఇందుక్కారణం అమెరికా, ఇటలీ, స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్ తదితర దేశాల్లో వెలుగుచూస్తున్న కొత్త కేసులే. కానీ లాటిన్ అమెరికా, ఆఫ్రికా, దక్షిణాసియా దేశాల్లో కొత్త కేసుల సంఖ్య తక్కువగానే కనిపిస్తోంది. ఈ దేశాల్లో వ్యాధి గుర్తింపు నిమిత్తం చేసే పరీక్షల సంఖ్య తక్కువగా ఉండడం కూడా ఈ వ్యత్యాసానికి కారణంగా భావిస్తున్నారు. పరీక్షల వ్యూహంలోనే ప్రపంచ వ్యాప్తంగా మార్పులు తేవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ యోచిస్తోంది.
జనాభాలో ఒక మిలియన్‌కు నిర్వహించిన పరీక్షల సంఖ్య ఆధారంగా వీటి విస్త •తిని లెక్కిస్తారు. ఆ లెక్కన భారత్‌లోని కేరళలో అత్యధిక సంఖ్యలో పరీక్షలు చేపట్టారు. భారత్‌లో ఇంతవరకు సుమారు 30వేల నమూనాల్ని పరీక్షించిన ట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకటించింది. ఇందులో కేరళ అత్యధికంగా 5,432 పరీక్షలు చేసింది. ఆ తర్వాత కర్ణాటక 3,076, రాజస్థాన్ 2,325 పరీక్షలు చేసింది. మిగిలిన రాష్ట్రాలన్నీ ఈ విషయంలో వెనుకబడ్డాయి. భారీ జనాభా ఉన్న ఉత్తర్‌ప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలు ఖచ్చితమైన డేటాను అందించలేక పోతున్నాయి. ఆ రాష్ట్రాల్లో అతితక్కువ పాజిటీవ్ కేసులు నమోదుకావడం అక్కడ డేటాతో పాటు పరీక్షల నిర్వహణ సంఖ్యలో ఉన్న లోపాలు కూడా కారణమని భావిస్తున్నారు. భారత్‌లో టెస్ట్‌కు వినియోగించే కిట్ల లభ్యత లేదు. ప్రపంచ వ్యాప్తంగా పరీక్షకే ప్రాధాన్యతనివ్వమంటూ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. కానీ పరీక్షల నిర్వహణకు భారత్‌లో కొన్ని నియంత్రణలున్నాయి. అందరికీ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం అనుమతించలేదు. ప్రయాణ చరిత్రకనుగుణంగానే పరీక్షలు చేస్తున్నారు.
దేశంలో ఈ వ్యాధి రెండో దశకు చేరుకున్న అనంతరం ఇప్పుడిప్పుడే ఇతర మార్గాల్లో వ్యాధి సంక్రమించిన సందేహాలున్న వారిక్కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు. దేశంలో మరింత దూకుడుగా పరీక్షలు నిర్వహిస్తే తప్ప యదార్ధంగా ఎంతమందికి ఇది సోకిందన్న విషయంపై స్పష్టత రాదు. అలాగే దేశంలో దీని పరిణామాన్ని, ప్రభావాన్ని ఖచ్చితంగా అంచనావేయగలిగే పరిస్థితుండదని నిపుణులు పేర్కొంటున్నారు.













