హెచ్ 1బీ వీసా మార్పులపై అమెరికాలో వ్యతిరేకత
హెచ్ 1బీ వీసాల్లో మార్పులు చేయాలన్న ట్రంప్ ప్రభుత్వ నిర్ణయం పట్ల అమెరికాలో కొందరు ప్రజాప్రతినిధులు, న్యాయవాదుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆలోచనలతో అమెరికాకు నష్టం జరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. హెచ్ 1బీ వీసాల పొడిగింపును నిలిపివేస్తే 5 లక్షల నుంచి 7.5 లక్షల మంది భారతీయ అమెరికన్లు వెనక్కి వెళ్లిపోవాల్సి ఉంటుందని, ఈ పరిణామాలు అమెరికాను ఇక్కట్లపాలు చేస్తాయని పలువురు నేతలు, న్యాయవాదులు అంచనా వేస్తున్నారు. నిపుణులు, ప్రతిభావంతులు వెనక్కివెళ్లిపోతే అమెరికాకు అన్ని విధాలా నష్టం జరుగుతుందని వారు విశ్లేషిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల సందర్భంగా అమెరికాలో ఉద్యోగాలన్నీ స్థానికులకే దక్కాలని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో గెలిచి దేశాధ్యక్ష పదవిని చేపట్టాక అమెరికన్లకు తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు హెచ్ 1బీ వీసాలను పొడిగించరాదని ట్రంప్ నిర్ణయించారు.













