ఎన్నారై ఝాన్సీ రెడ్డికి షాక్.. భారత పౌరసత్వం నిరాకరించిన కేంద్రం
తెలంగాణ రాష్ట్రంలోని పాలకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానంటూ ప్రకటించిన ఎన్నారై హనుమాండ్ల ఝాన్సీ లక్ష్మీరెడ్డికి షాక్ తగిలింది. భారత పౌరసత్వం కోసం ఆమె చేసుకున్న దరఖాస్తును కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. అమెరికా పౌరురాలైన ఝాన్సీ తాను 2022 జూన్ 16 నుంచి భారత్‌లోనే నివాసం ఉంటున్నానని, తనకు భారత పౌరసత్వం ఇవ్వాలని ఇటీవల దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో రోడ్ నవంబర్ 12లో ఉంటున్నట్టు పేర్కొన్నారు. ఈ దరఖాస్తుపై విచారణ జరుపాలని కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ కలెక్టర్‌కు పంపింది. ఈ మేరకు విచారణలో ఝాన్సీ లక్ష్మీరెడ్డి జూన్ 16 తర్వాత అమెరికా పాస్‌పోర్ట్‌తో పలుమార్లు ఆ దేశానికి వెళ్లివచ్చినట్టు తేలింది. పౌరసత్వ నిబంధనల ప్రకారం ఎన్నారైలు కనీసం ఏడాదిపాటు భారత్‌లో నివాసం ఉండాలి. కానీ ఆమె పలుమార్లు అమెరికాకు వెళ్లారని, భారత్‌కు టూరిస్ట్‌గా వచ్చి వెళ్లినట్టు విచారణలో తేలింది. దీంతో దరఖాస్తును తిరస్కరిస్తున్నట్టు ఈ నెల 4న హైదరాబాద్ కలెక్టర్ లిఖితపూర్వకంగా రిజిస్టర్ పోస్టు ద్వారా రaాన్సీకి పంపించారు. ఝాన్సీ వ్యవహారంపై పాలకుర్తిలో రాజకీయంగా తీవ్ర చర్చ జరుగుతున్నది.













