ATA: ఆటా నాయకత్వ ఎన్నికలలో గందరగోళం…అసలు ఏం జరిగింది?
 
                                    
జనవరి 18వ తేదీన లాస్ వెగాస్ లో అమెరికా తెలుగు సంఘం (ATA) నూతన అధ్యక్షులుగా శ్రీ జయంత్ చల్లా(Jayanth Challa) 2025-27 సంవత్సరానికి నాయకులుగా బాధ్యతలు చేపట్టారు. వెంటనే జరగాల్సిన ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎన్నికలు జరగకపోవడం, అక్కడి సభ్యులు అందరూ గొడవ చేయడం వలన గందరగోళ పరిస్థితి ఏర్పడినందున ఎన్నికలు జరపకుండానే సమావేశంను అర్థాంతరంగా ముగించడం, అదే విషయాన్ని ఆటా నూతన అధ్యక్షులు శ్రీ జయంత్ చల్లా పత్రికా ప్రకటన చేయడం ఒకింత ఆశ్చర్యం కలిగించింది.
నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను అమెరికాలో అతిపెద్ద సంస్థలుగా పేరు పొందిన తానా, ఆటా సంస్థలు తెలుగు రాష్ట్రాలలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల మాదిరిగా ప్రవర్తిస్తుంటాయి. ఈపార్టీలకు ఈ సంఘాలకు ఉన్న పోలికను ఇదివరకు తెలుగు టైమ్స్ లో ఒకసారి ప్రచురించాము. తానా లో ఉన్న మెజారిటీ సభ్యుల ప్రొఫైల్ గమనిస్తే అది తెలుగుదేశం పార్టీకి సరిపోతుంది కానీ తానా వ్యవహార శైలి మాత్రం కాంగ్రెస్ సభ్యులలాగా ఉంటుంది. ఎవరు ఎప్పుడైనా మాట్లాడవచ్చు. ఆ భావ స్వాతంత్య్రాన్ని దుర్వినియోగం చేసేవారే అనేకం. అలాగే ఆటా సభ్యుల ప్రొఫైల్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా ఉంటుంది కానీ వ్యవహార శైలి మాత్రం తెలుగుదేశం పార్టీ లాగానే. ఎవరు ఎక్కడ ఎప్పుడు మాట్లాడకూడదు, మాట్లాడరు. ఇప్పటికీ గత నెల రోజుల నుంచి తానాలో జరిగిన తప్పిదం గురించి దానికి కారణమైన నాయకత్వంలో వచ్చిన తగాదా అని మాట్లాడుకుంటున్న తెలుగు కమ్యూనిటీకి ఇప్పుడు ఆటాలో నాయకత్వ ఎన్నికల సమయంలో భేదాభిప్రాయాలు రావడం, గందరగోళ పరిస్థితులలో జరిగే ఎన్నికల ప్రక్రియని ఆపేయడం అన్న వార్త నిజంగా బాధాకరం.
అసలు ఏం జరిగింది అని కొంతమంది ఆటా మిత్రులతో మాట్లాడితే తెలిసిన కొన్ని విషయాలు ఇప్పుడు మీ ముందుకు తెస్తున్నాము. ఆటాలో సంస్థ బైలాస్ ప్రకారం సభ్యులు ఆటా ట్రస్టీలను ఎన్నుకొంటారు. అమెరికాలోని అన్ని ప్రాంతాల వాళ్ళు ప్రాతినిధ్యం వహించేలా ఈ ట్రస్టీస్ ఎన్నుకోబడతారు ఆ విధంగా ఈసారి ఆటా ట్రస్టీల ఎన్నిక సజావుగా జరిగి 15 మంది కొత్త సభ్యులు, ఇప్పుడున్న వారిలో ఇంకా కొనసాగవలసిన 16 మంది ట్రస్టీలు మొత్తం 31 మంది ట్రస్టీలలో 2025-27 కాలానికి ఏర్పడింది . రెండు సంవత్సరాల క్రితం ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీ జయంత్ చల్లాతో కలిసి ఈ బోర్డ్ పనిచేస్తుంది. కొత్త అధ్యక్షుడి పదవి స్వీకారానికి, ఎన్నికైన వారితో ఏర్పడిన కొత్త బోర్డు సభ్యులతో లాస్ వెగాస్‌లో 18-19 జనవరి 2025 వ తేదీల్లో ఆటా నాయకత్వ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి దాదాపు 200 మంది పైగా ఆటా నాయకులు, మెంబర్లు వచ్చారు. ఆనందం గా, హాట్టహాసం గా కొత్త టీమ్ ఎన్నిక జరిగి సంబరాలు జడుపుకొనే తరుణం అది.
ఆటా లో కూడా రెండు వర్గాలు ఉన్నాయా? వర్గ పోరు మొదలయిందా?
జనవరి 18 తేదీన మొదటగా శ్రీ జయంత్ చల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు ఆటా బోర్డు సభ్యులు 2025-27 కాలానికి ఎగ్జిక్యూటివ్ కమిటీకి ప్రెసిడెంట్ ఎవరినైనా ఎన్నుకోవాలి. ఆటా లో సంస్థ బైలాస్ ప్రకారం సభ్యులు లైఫ్ 2025`27 సంవత్సరానికి అధ్యక్ష పదవికి రెండు నామినేషన్ లు వచ్చాయి అని తెలిసింది. శ్రీ అనిల్ బోధి రెడ్డి, శ్రీ సతీష్ రెడ్డి ఇద్దరు ఈ పదవి కోసం పోటీ పడ్డారు. ఆటా లో ఎప్పటినుంచో వారు పనిచేస్తూ సేవలు అందిస్తూ నాయకత్వంలో అనేక పదవులు నిర్వహించి ఇప్పుడు అధ్యక్ష పదవికి వచ్చారు. ఇద్దరూ ఆ పదవికి అన్ని విధాలుగా అర్హులైన వ్యక్తులే అని చెప్పాలి అలాగే ఆటా ఎగ్జిక్యూటివ్ కమిటీలో సెక్రటరీ జాయింట్ సెక్రెటరీ పదవులకు కూడా ఎన్నికలు జరగాలి.ఆటా బైలాస్ ప్రకారం ఎప్పుడు ఎన్నికలు జరిగినా అది సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో జరుగుతాయని తెలిసింది. ఈసారి అలా సీక్రెట్ బ్యాలెట్ కాకుండా ఓపెన్ గా జరగాలని కొందరు సభ్యులు పట్టుబట్టడంతో కొంచెం సమయం గడిచిపోయింది.
అధ్యక్షులు శ్రీ జయంత్ చల్లా ఈ ఎన్నికల ప్రక్రియ కోసం మాజీ అధ్యక్షులు ఆటా సీనియర్ నాయకులైన శ్రీమతి సంధ్య గవ్వ, శ్రీ పరమేష్ భీమ్ రెడ్డి, శ్రీ కరుణాకర్ మాధవరం, శ్రీ కరుణాకర్ అసిరెడ్డిని పరిశీలకులుగా నియమించారు. బ్యాలెట్ పేపర్స్ తయారు చేసి వాటిపై పరిశీలకుల సంతకాలు పెట్టించి అందరికి ఇచ్చారు. అయితే ఇన్ని సంతకాలు ఎందుకని ఇది చాలా గందరగోళంగా ఉందని, కొందరు సభ్యులు అభ్యంతరం చెప్పారని తెలిసింది అప్పుడు ఓ సభ్యుడు ఇంకొంచెం దురుసుగా స్టేజ్ మీదకు వెళ్లి మైక్ తీసేసుకొని మాట్లాడటం మొదలుపెట్టడం కూడా జరిగింది. దాంతో కార్యక్రమంలో తీవ్రమైన గందరగోళం ఏర్పడింది అని తెలిసింది ఈ సమయంలో వేరే గత్యంతరం లేక శ్రీ జయంత్ చల్ల సభను నిరవధికంగా వాయిదా వేస్తూ ముగించారని తెలిసింది. ఆ తరువాత మరుసటి రోజు శ్రీ జయంత్ చల్ల ఒక పత్రికా ప్రకటన ద్వారా ఆటా బైలాస్ ప్రకారం సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలోనే ఇప్పటివరకు ఎన్నికలు జరిగాయని అదే విధంగా జరపాలని తాము ప్రయత్నించామని, త్వరలోనే ఇంకొక సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికలు జరుపుతామని తెలియజేశారు.
అయితే ఈ గొడవ లాస్ వేగాస్ లో అప్పటికప్పుడు మొదలయిన గొడవ కాదని, ఒక సంవత్సరం గా ఆటా సంస్థ లో అగ్ర నాయకత్వం లో కొన్ని విభేదాలు వచ్చాయని, ఆ కారణం గానే మెల్ల మెల్ల గా రెండు గ్రూప్ లు గా అయిపోయాయని కూడా తెల్సుస్తోంది. ఇటీవల జరిగిన బోర్డు అఫ్ ట్రస్టీస్ ఎన్నికల సమయం లో కూడా రెండు గ్రూప్ లు వారి వారి సభ్యులను గెలిపించుకునేందుకు ప్రయత్నాలు చేశారని, ఆ విధం గా ఇప్పుడు ఎన్నికైన 15 మంది ట్రస్టీలు, పాటా బోర్డు నుంచి కొనసాగే 16 మంది ట్రస్టీలు కలిపి వున్నా 31 మంది లో కూడా కొంచెం అటూ ఇటుగా రెండు వర్గాలు గా అయిపోయాయని తెలుస్తోంది.
ఎప్పుడైతే సీక్రెట్ బాలట్ లో ఎన్నికలు జరుపుతామని అధ్యక్షులు శ్రీ జయంత్ చల్ల ప్రకటించగానే రెండు వర్గాల ట్రస్టీలు , వారి మద్దతు దారులు జరిపమని, అలా జరపకూడదు అని అరవటం చేసారని తెలిసింది. ఈ గందరగోళ పరిస్టులలో అధ్యక్షులు మీటింగ్ ని వాయిదా వేస్తూ వెళ్లిపోయారని కూడా తెలిసింది. అయితే మిగతా వర్గం వారు వారి Attorney ని ఫోన్ లో సంప్రదించి ఆయన ఇచ్చిన సూచనల మేరకు మీటింగ్ ని కొనసాగించి ఎన్నికలు జరుపుకున్నారని, ఎన్నికైన వ్యక్తుల వివరాలు ప్రకటించడమే కాకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని కూడా తెలుస్తోంది. ఆ ప్రకటన ప్రకారం శ్రీ అనిల్ బోధి రెడ్డి ప్రెసిడెంట్ ఎలెక్ట్ గా శ్రీ శ్రీకాంత్ గుడిపాటి ట్రేజరర్ గా , శ్రీమతి శారద సింగిరెడ్డి జాయింట్ సెక్రటరీ గా , శ్రీ విజయ్ తూపల్లి జాయింట్ ట్రెజరర్ గా ఎన్నికైనట్టు తెలిసింది.
కానీ శ్రీ జయంత్ చల్లా ఈ విషయంపై స్పందిస్తూ ఆటా బై లాస్ ప్రకారమే తాము ఎన్నికలు జరుపుతామని , వేరే గ్రూప్ ప్రకటించిన ఎన్నికలు చెల్లవని కూడా తెలియ చేశారు. ఈ విషయం పై శ్రీ జయంత్ మాట్లాడుతూ ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరమని , తాము ఒక పక్క ఆటా లీగల్ సెల్, ఆటా attorney లను సంప్రదిస్తున్నామని, రెండో పక్క ఆటా పెద్దలు రెండు వర్గాల నాయకులతో మాట్లాడి ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.
పెరుగుతున్న తెలుగు కమ్యూనిటీ, పెరుగుతున్న తెలుగు నాయకులు, పెరుగుతున్న పోటీ వాతావరణం వలన ఇలాంటి సమస్యలు వస్తున్నాయని తెలుస్తోంది. దాదాపు 35,000 మంది సభ్యులు ఉన్న, 34 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆటా సంస్థకు ఉన్న మంచి పేరు పాడు చేసుకునే విధంగా ప్రజాస్వామ్యపు విధానాలను అపహాస్యం చేసే విధంగా నాయకులు ( రెండు వర్గాలనుంచి ) ఈ విధంగా చేయడం ఎవ్వరూ హర్షించరని, అందువల్ల అందరూ సమన్వయం పాటించి సామరస్యంగా ఈ సమస్యను పరిష్కరించుకోగలరని ఆశిద్దాం.
చెన్నూరి వెంకట సుబ్బారావు
ఎడిటర్ తెలుగుటైమ్స్











