NATS: చరిత్రలో నిలిచిపోయేలా అమెరికా తెలుగు సంబరాలు: కాన్ఫరెన్స్ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ
నాట్స్ (NATS) 8వ అమెరికా తెలుగు సంబరాలు ఫ్లోరిడా రాష్ట్రంలోని టాంపా వేదికగా జులై 4,5,6 తేదీల్లో అంగరంగ వైభవంగా జరుగనున్నది. ఈ సంబరాలకు కన్వీనర్‌గా ఉన్న శ్రీనివాస్ గుత్తికొండ అమెరికా తెలుగు సంబరాల వివరాలను తెలియజేశారు. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా వివిధ సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సంగీత నవ అవధాన సాహితీ సౌరభాలతో కమనీయ కవిత నీరాజనాలతో స్థానిక తెలుగు వారసత్వపు లలిత కళా ప్రదర్శనలతో ఈ సంబరాలు అందరినీ ఆకట్టుకునేలా ఉంటాయని చెప్పారు. ‘‘ఇది మన తెలుగు సంబరం… కలిసి అందరం జరుపుకుందాంమని ఆయన పిలుపునిచ్చారు.
టాంపా డౌన్‌టౌన్‌లోని టాంపా కన్వెన్షన్ సెంటరులో నిర్వహించనున్న ఈ వేడుకలు కలియుగ దైవం తిరుమల శ్రీవారి ఆశీస్సులతో, కాణిపాకం విఘ్నేశ్వరుని కృపతో దిగ్విజయంగా జరుగుతాయని ఆయన అంటూ, అమెరికాలో ప్రస్తుతం ఎన్నారైలలో ఉద్యోగ భద్రత ఇతర విషయాల్లో కొంత అనిశ్చితి ఉన్న నేపథ్యంలో ఇంతటి పెద్ద వేడుక జరపడం సవాల్ లాంటిదేనని చెప్పారు. ‘వసుదైక కుటుంబమ’నే నినాదాన్ని మరోసారి వినిపించాలనే లక్ష్యంగా ఈ వేడుకలను విజయవంతం అన్నారు. ఈ సంవత్సరం సంబరాలను నిర్వహించడం ఒక గొప్ప సవాలుగా భావిస్తున్నామన్న ఆయన.. ప్రస్తుత ఆర్థిక, సామాజిక పరిస్థితుల్లో కూడా ఈ మహోత్సవాన్ని ఏర్పాటు చేయడం చారిత్రాత్మకమైన విషయమని గుర్తుచేశారు. తాను, నాట్స్ బోర్డు ఛైర్మన్ పిన్నమనేని ప్రశాంత్, అధ్యక్షుడు మందాడి శ్రీహరి, మాజీ అధ్యక్షుడు మదన్ పాములపాటి, తమ నిర్వాహక బృంద సభ్యులు అందరూ ఈ సభను విజయవంతం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. మూడురోజుల తెలుగు సంబరాల ప్రత్యేకతల గురించి శ్రీనివాస్ మాట్లాడుతూ 4వ తేదీ సాయంత్రం బ్యాంక్వెట్ విందుతో కార్యక్రమం మొదలవుతుందని, చంద్రబోస్ ఆధ్వర్యంలోని నాటు బ్యాండ్ ఈ విందులో అలరిస్తుందని తెలిపారు. 5వ తేదీ ఉదయం స్వాగత నృత్యాలు, సాయంత్రం పుష్ప చిత్రబృందం సందడి, దేవిశ్రీ సంగీత లాహిరి, 6వ తేదీ ఉదయం తితిదే వేదపండితుల ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం, థమన్ సంగీత విభావరి, బాలయ్యకు జీవిత సాఫల్య పురస్కార ప్రదానోత్సవంతో పాటు రెండు రోజులు తెలుగు వైభవానికి అద్దంపట్టే పలు స్థానిక ప్రవాసుల ప్రదర్శనలు, చర్చావేదికలు, ఇష్టాగోష్టిలు ఈ వేడుకల్లో ఏర్పాటు చేశామన్నారు.
నాట్స్ మొదటి కన్వెన్షన్ 2009లో ఫ్లోరిడాలోనే ఆరంజ్ కౌంటీ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిందని గుర్తుచేసుకున్న ఆయన, డల్లాస్, లాస్ ఏంజెలెస్, చికాగో, న్యూజెర్సీ తదితర నగరాల్లో గత సంబరాలను నిర్వహించుకుని 16 సంవత్సరాల తరువాత మళ్లీ ఫ్లోరిడా రాష్ట్రంలో తిరిగి అమెరికా తెలుగు సంబరాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సంబరాలకు సమన్వయకర్తగా వ్యవహరించే సదవకాశం ఇచ్చిన నాట్స్ కార్యవర్గానికి శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. నాట్స్ స్థాపన నుండే సంస్థలో చురుకైన పాత్ర పోషించిన శ్రీనివాస్…హెల్ప్ లైన్ డైరెక్టర్‌గా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా, నాట్స్ బోర్డ్ చైర్మన్‌గా పనిచేశారు. నాట్స్‌లోని కీలక విభాగాల్లో పనిచేసిన అనుభవాన్ని ఈ సంబరాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు వినియోగిస్తానని ఆయన పేర్కొన్నారు.
ఈ తెలుగు సంబరాలను కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం చేయాలనే ధృడసంకల్పంతో తాము ముందుకు సాగుతున్నామని శీనివాస్ గుత్తికొండ చెప్పారు. ఈ మహాసభల విజయవంతానికి దాదాపు 200 మంది కన్వెన్షన్ కమిటీల సభ్యులు విస్తృతంగా కృషి చేస్తున్నారు. కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండకి వ్యక్తిగతంగా మరియు నాట్స్ మాజీ ఛైర్మన్ గా పెద్ద ఎత్తున పరిచయాలు మరియు అనుభవం ఉంది. అలాగే ప్రస్తుత నాట్స్ చైైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని కూడా టాంపా వాసి కావడం మరియు సినీ పరిశ్రమతో పరిచయాలుండడం, నాట్స్ టాంపా చాప్టర్ ఎప్పటి నుంచో చురుకుగా ఉండడం వంటి పలు కారణాల రీత్యా ఈ కన్వెన్షన్ పై అంచనాలు పెరిగాయి. అంచనాలను దాటేస్తూ నందమూరి బాలకృష్ణ , దగ్గుబాటి వెంకటేష్, అల్లు అర్జున్ వంటి మహానటులు ఈ మహాసభలకు రానుండడం, తమన్ మరియు దేవిశ్రీ ప్రసాద్ తో రెండు మ్యూజికల్ కాన్సర్ట్స్ ఏర్పాటుచేయడంతో ఈ కన్వెన్షన్ పై అంచనాలు ఆకాశాన్నంటింది. స్పాన్సర్షిప్, హాస్పిటాలిటీ, పబ్లిసిటీ, రిజిస్ట్రేషన్, డెకొరేషన్, ఫుడ్, యూత్ తదితర కమిటీల సభ్యులు నాట్స్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా శతవిధాలా కష్టపడుతున్నారు.







