TANA: తానా తెలుగు పండుగ వేడుకలకు అందరూ రావాలి… కాన్ఫరెన్స్ చైర్మన్ గంగాధర్ నాదెళ్ళ
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ప్రతి రెండేళ్ళకోమారు నిర్వహించే తానా మహసభలు ఈసారి కూడా అంగరంగ వైభవంగా జరగనున్నాయి. తెలుగువారి సాంస్కృతిక వైభవాన్ని తలపించేలా కార్యక్రమాలు ఈ మహాసభల్లో కనువిందు చేయనున్నాయి. జూలై 3 నుంచి 5వ తేదీ వరకు డిట్రాయిట్ (Detroit) లో జరిగే ఈ తానా 24వ ద్వైవార్షిక మహాసభలకు ప్రపంచం నలుమూలల నుంచి ఎంతోమంది తెలుగువాళ్ళు హాజరుకానున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్‌లు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ వేడుకలకు వస్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలకు చెందిన నాయకులు కూడా తరలి వస్తున్నారు. ఇంతమంది రాజకీయ నాయకులను ఒకే వేదికపై తానా మహాసభల ద్వారా తీసుకువస్తోంది.
అమెరికాలోని తెలుగు కమ్యూనిటీవాళ్ళు రాజకీయ నాయకులతో సమావేశమయ్యేందుకు ఈ మహాసభలు దోహదం చేయనున్నాయి. అలాగే ఈ మహాసభల్లో ప్రజా ప్రతినిధులతో, మంత్రులు ఇతర నాయకులతో మాక్ అసెంబ్లీని కూడా ఏర్పాటు చేయనున్నాము. మరోవైపు ఈ మహాసభల్లో సినిమా హీరోలు, హీరోయిన్ లు కూడా కనువిందు చేయనున్నారు. టాలీవుడ్ లో సీనియర్ నటులు, నేటితరం నటులు, హీరోయిన్‌లు, ఇతర కళాకారులు ఈ వేడుకలకు వస్తున్నారు. రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్ తో పాటు హీరో నిఖిల్, పాపులర్ హీరోయిన్ సమంత, ఐశ్వర్య రాజేశ్, యాంకర్ సుమ, దర్శకులు కె. రాఘవేంద్రరావు, అనిల్ రావిపూడి, బోయపాటి శ్రీను, వంటి ప్రముఖతారాగణం ఈ వేడుకల్లో పాల్గొంటోంది. అలాగే ఈ వేడుకల్లో స్థానిక కళాకారులతో విభిన్న కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశాము. తెలుగువైభవాన్ని చాటేలా కార్యక్రమాలు కనిపించనున్నాయి.
అలాగే యూత్‌కు ప్రాధాన్యం ఇచ్చేలా కార్యక్రమాలతోపాటు ప్రత్యేకంగా యూత్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాము. అందుకు తగ్గట్టే ఈ మహాసభలకు తరతరాల తెలుగుదనం- తరలివచ్చే యువతరం అనే ఇతివృత్తంను నిర్ణయించాము. యూత్ కోసం అనేక ఉత్సాహపూరితమైన కార్యక్రమాలు కూడా ఉన్నాయి.
ఈ మహాసభల్లో ప్రముఖ సంగీత దర్శకులచే సంగీత విభావరులను కూడా ఏర్పాటు చేశాము. తమన్, చిత్ర, సునీత ఎస్‌పిబి చరణం వాళ్ళ సంగీత విభావరులు వచ్చినవారిని ఉల్లాసపరిచేలా ఉంటాయి.
ఎన్నోకార్యక్రమాలు, ఎంతోమంది ప్రముఖులు వచ్చే ఈ తెలుగు వేడుకలకు అందరూ వచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాను.







