కామెడీ కింగ్ అలీతో ఓ సాయంత్రం!
వారాంతం, అందునా అలీతో అంటే ఆ కిక్కే వేరప్పా!
నవంబర్ 10 శనివారం సాయంత్రం 4 నుండి దాదాపు 8 గంటల వరకు మెంఫిస్ మహాపట్టణంలో ప్రవాస తెలుగు వారు అలీతో ఆనందంగా గడిపారు. దాదాపు 400 మంది తెలుగు వారు వెస్ట్ కాళీర్వీల్లె మిడిల్ స్కూల్ ఆడిటోరియంలో పాడుతా తీయగా గాయని వంశి ప్రియ, ప్లేబాక్ గాయకుడు వేణు శ్రీరంగం సరాగాల నడుమ, రఘు సమయోచితమైన యాంకరింగ్, ఆలీ అద్భుతమైన కామెడీతో ఈ కార్యక్రమం ఆద్యంతం నవ్వులు పువ్వులై పూచాయి. తెలుగు అసోసియేషన్ అఫ్ మెంఫిస్ ప్రవాస తెలుగు కుటుంబాలకి ఎన్నో ఎన్నెనో సాహిత్య, సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు సంవత్సరం పొడుగూతా ఏర్పాటు చేస్తుంది.
సంక్రాంతి సంబరాలు, ఉగాది వేడుకలు, వాన భోజనాలు, మహిళా దినోత్సవం, బతుకమ్మ ఉత్సవం ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండ తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రాల తెలుగువారు తప్పక చేసుకునే పండుగలు, ఉత్సవాలు కాగా సరదాలు-సరాగాలు వంటి ప్రత్యేక కార్యక్రమాలు మెంఫిస్ తెలుగు కళాసమితి అడపా దడపా ఏర్పాటు చేస్తుంటారు. అలీతో అద్భుతమయిన ఈ కార్యక్రమానికి ఎందరో వాలంటీర్లు సమిష్టి కృషి, మరెందరో ఆర్ధికంగా సహకరించడం వాళ్ళ సాధ్యమైందని తెలుగు అసోసియేషన్ అఫ్ మెంఫిస్ ప్రెసిడెంట్ చిరంజీవి గొంప చెప్పారు. చివరగా తెలుగువారి ట్రేడ్ మార్క్ వంటకాలతో రుచికరమైన విందుభోజనంతో కామెడీ కింగ్ అలీతో సరదాలు – సరాగాలు కార్యక్రమం ముగిసింది.
Dr. Ramana Vasili
Director: Spiritual Foundation, Inc.
901-387-9646 or ramanavvasili@hotmail.com













