డల్లాస్ మహానాడుపై చంద్రబాబు సంతోషం
డల్లాస్లో జరిగిన మహానాడు చివరిరోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహానాడుకు హాజరైన వారిని ఉద్దేశించి మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపుకు ఎన్నారై టీడిపి కార్యకర్తలు సహకరించాలని కోరారు. సాంకేతికతను ఉపయోగించుకుని 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ప్రచారం చేయాలని అంటూ, అమెరికాలో కూడా మహానాడును విజయవంతంగా నిర్వహించడంపట్ల ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు.
ఎన్నారై టీడిపికి అధికారిక గుర్తింపు
అమెరికాలో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఎన్నారై తెలుగుదేశం పేరుతో కార్యకర్తలు చేస్తున్న ప్రచారానికి, కార్యక్రమాలకు అధికారిక గుర్తింపును ఇవ్వాలని డల్లాస్ మహానాడులో తీర్మానించారు. ఎపి తెలుగుదేశం పార్టీ, టీటీడిపి లాగా ఎన్నారై టీడిపిని కూడా అనుబంధ విభాగంగా గుర్తించాలని కోరుతూ మంత్రి గంటా శ్రీనివాసరావు చేసిన తీర్మానాన్ని ఎంపి సిఎం రమేష్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇ.పెద్దిరెడ్డి బలపరిచారు. దీంతో ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో చివరిరోజున ఎన్నారై టీడిపి ఈ గుర్తింపుతో మహానాడును విజయవంతంగా నిర్వహించిందన్న పేరుతోపాటు, అధికారిక గుర్తింపును సాధించిందని పలువురు పేర్కొన్నారు.













