తెలంగాణకు సిస్కో … అమెరికా పర్యటనలో కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ డిజిటల్ కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయ్యేందుకు సిస్కో కంపెనీ ఆసక్తి చూపిందని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. అమెరికాలో ఐదో రోజు పర్యటనలో భాగంగా ఆయన సిలికాన్ వ్యాలీలో పర్యటించారు. ఈ సందర్భంగా సిస్కో చైర్మన్ జాన్ ఛేంబర్స్తో కలిశారు. సిస్కో చైర్మన్ కేటీఆర్‌కు సాదర స్వాగతం పలికి కంపెనీకి సంబందించిన ఎక్స్పీరియన్స్ కేంద్రంలోని విశేషాలను వివరించారు. ప్రపంచం డిజటలైజేషన్ దిశగా సాగిపోతుందన్న ఛాంబర్స్, డిజిటల్ ఇండియా, డిజిటల్ తెలంగాణ విషయంలో సిస్కో కంపెనీకున్న ఆలోచనలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
తెలగాణ ప్రభుత్వం చేపట్టిన టి హబ్, మిషన్ భగీరథ వంటి కార్యక్రమాలపై పూర్తి అవగాహన ఉందన్నారు. ఇంటింటికీ ఇంటర్నెట్ అందించే కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టడం పట్ల సిస్కో చైర్మన్ ప్రశంసలు కురిపించారు. దీని ద్వారా ఆర్థిక వ్వవస్థ బలోపేతం అవ్వడంతో పాటు గ్రామీణ సమాజంలో మార్పులు వస్తాయన్నారు. పౌర సేవలల్లో గణనీయమైన మార్పు వస్తుందని, వీడియో ఇంటరాక్టివ్ టెక్నాలజి ద్వారా ఇ హెల్త్, ఇ ఎడ్యుకేషన్ రంగాల్లో అనేక ప్రయోజనాలుంటాయని తెలిపారు.
ఈ మేరకు తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ఏర్పాటు తర్వాత ఎలాంటి మార్పులు వస్తాయో తెలియజేసే టెక్నాలజీ డెమాన్స్ట్రేసన్ నెట్ వర్క్ నిర్మాణం చేసేందుకు సహకరిస్తామని తెలిపారు. ఈ మేరకు సిస్కో ఇండియా బృందాన్ని తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరపాలని ఆదేశించారు. తెలంగాణలో డిజిటల్ మౌలిక వసతుల రంగంలో ఫైబర్ గ్రిడ్ ఒక మైలు రాయిగా నిలుస్తుందన్నారు. సిస్కో కంపెనీ తయారీ యూనిట్ ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని కేటీఆర్ కోరారు.













