ఆటా వేడుకలకు, కాన్ఫరెన్స్ కు ముఖ్య అతిధిగా చిరంజీవి
ఆహ్వానించిన ఆటా అధ్యక్షుడు భువనేష్ బుజాల
అమెరికా తెలుగు సంఘం (ఆటా) అధ్యక్షుడు భువనేష్ బుజాల, ఇతర ఆటా నాయకులు తమ హైదరాబాద్ పర్యటనలో భాగంగా మెగాస్టార్ చిరంజీవిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా డిసెంబర్ 2021లో తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించే ఆటా వేడుకలకు, వచ్చే సంవత్సరం జూలైలో వాషింగ్టన్డీసీలో నిర్వహించే ఆటా మహాసభలకు ముఖ్య అతిధిగా రావాల్సిందిగా ఆటా అధ్యక్షుడు భువనేష్ బుజాల ఆహ్వనించారు.
ఆటా తెలుగు కమ్యూనిటీకి చేస్తున్న సేవా కార్యక్రమాలను కూడా ఈ సందర్భంగా ఆటా నాయకులు చిరంజీవికి వివరించారు. కోవిడ్ సమయంలో ఆటా తెలుగు ప్రజలకు చేసిన కార్యక్రమాలను ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల పంపిణీ ఇతర విషయాలను వారు తమ భేటీలో తెలియజేశారు. చిరంజీవి బ్లడ్బ్యాంక్తో కలిసి బ్లడ్డ్రైవ్లు, ఇతర కార్యక్రమాలను ఆటా వేడుకల సందర్భంగా నిర్వహించాలని భావిస్తున్నట్లు వారు చిరంజీవికి తెలియజేశారు. సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ ఆటా నాయకులను కలిసేందుకు, తమతో 45 నిముషాలకుపైగా భేటీ అయినందుకు ఆటా నాయకులు చిరంజీవికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ భేటీలో ఆటా అధ్యక్షుడు భువనేష్ బుజాలతోపాటు జయంత్ చల్లా ఇతర ఆటా నాయకులు పాల్గొన్నారు.













