76 రోజుల తర్వాత లాక్డౌన్ ఎత్తివేత
ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్‌కు పుట్టినిల్లు, తొలి నాళ్లలో మహమ్మారికి కేంద్ర స్థానమైన చైనాలోని వుహాన్ నగరంలో 76 రోజుల తర్వాత లాక్డౌన్ ఎత్తివేశారు. రోడ్డు, గగన, రైలు మార్గాల్లో ప్రయాణాలపై ఉన్న నిషేధం మంగళవారం అర్థరాత్రి నుంచి తొలగిపోయింది. దీంతో నగరంలోని 1.10 కోట్ల మందికి రెక్కలు విచ్చుకున్నట్లైంది. బుధవారం వేల మంది ప్రజలు మాస్కులు ధరించి రోడ్లపైకి వచ్చారు. దేశీయ విమాన సేవలతోపాటు, రైళ్లు, కార్లు, బస్సుల రాకపోకలు మొదలయ్యాయి. కరోనా వైరస్ మళ్లీ పంజా విసిరే అవకాశముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తివేతకే మొగ్గుచూపడం గమనార్హం.













