ఆకట్టుకున్న చికాగో ఆంధ్ర సంఘం పల్లె సంబరాలు
చికాగో ఆంధ్ర సంఘం ఆధ్వర్యంలో జనవరి 9న నిర్వహించిన పల్లె సంబరాలు 3 గంటలపాటు నిర్విరామంగా వినోదాల జల్లులు కురిపించాయి. చికాగో ఆంధ్ర సంఘం వారి ఫేస్బుక్ పుట ద్వారా మరియు టి.వి. ఆసియా తెలుగు ఛానెల్, ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశాయి. కోవిడ్ మహమ్మారి కారణంగా ఎవరి గృహాలకు వారు పరిమితమవుతున్న పరిస్థితుల్లో వీక్షకులు ఈ కార్యక్రమాన్ని థియేటర్లో ప్రత్యక్షంగా చూసిన దానికన్నా మిన్నగా ఆనందానుభూతిని పొందడంలో ఈ సాంస్కృతిక కార్యక్రమ నిర్వహణ బృందం కృతకృత్యులైంది. ముందుగా దీప ప్రజ్వలన, తదుపరి పూర్వ అధ్యక్షుని సత్కారంతో ఈ కార్యక్రమాలు ప్రారంభమైనాయి. జ్యోతి వంగర మరియు అన్విత పంచాగ్నుల సూత్రధారులుగా వ్యవహరిస్తూ కార్యక్రమాన్ని ఆద్యంతం రక్తి కట్టించారు. ముద్దులొలికే చిన్నారులు సాగరిక, కావ్య మరియు అమృత విఘ్నేశ్వర ప్రార్థనతో ఈ వినోద కార్యక్రమం నిరంతరాయంగా సాగడానికి దోహదం చేసారు.
చిరంజీవి సాకేత్ మంత్రవాది బాలకాండ శ్లోకాలను మధురంగా గానం చేయగా, మూడు సంవత్సరాల రుద్ర నేతి ముత్తుస్వామి దీక్షితార్ వారి కీర్తన పాడి వీక్షకుల ముద్దులను మూటగట్టుకొని సాగింది. చిన్నారులు ఇషాన్, ఇషిక, సరయూ మరియు కావ్వ ఛాంగు భళా, అనే తెలుగు పాటను క్రేజీ ఫీలింగ్ అనే పాప్ సాంగ్ నీ పాడి సాంప్రదాయం, ఆధునికతలను అనుసంధానించారు. ఆ విధంగా సంక్రాంతి పండుగలోని ఆనందాన్ని ముందుగానే మనకు పంచి, వీక్షకులను ఉత్తేజ పరిచి, తదుపరి కార్యక్రమాలపట్ల ఉత్కంఠను రేకెత్తించారు. చిరంజీవి శ్రావణి తెల్లాపగ్రడ సమకూర్చిన స్పెషల్ ఎఫెక్టస్ అద్భుతమనిపించాయి.
చలనచిత్ర గీతాలు, సంప్రదాయ మరియు జానపద గీతాల మేలుకలయికతో రూపు దిద్దుకొన్న ఈ కార్యక్రమాలన్ని తెలుగు ప్రజల విభిన్న సంస్కృతులకు అద్దంపట్టాయి. కూచిపూడి నాట్యనిలయం విద్యార్థులు ప్రదర్శించిన చక్కని తల్లికి ఛాంగు భళా అనే గేయరూపకం తెలుగువారి ప్రాచీన సాంప్రదాయ విశిష్టతను మన ముందు ఆవిష్కరింప చేసింది. శ్రీమతి వాసంతి అయ్యర్ శిష్యులు వివిధ నగరాల నుంచి విశిష్ట సాంకేతికత, అతుత్తమ సమన్వయముతో వీడియో ద్వారా సమర్పించిన అన్నమాచార్య కీర్తన గాయనీ, గాయకులందరూ ఒకే వేదికపై నుండి పాడరా అన్న అనుభూతిని కలుగచేసింది. సోదరి, సోదరులు వైష్టవి, వైభవ్ మాయాబజార్లోని అహ నా పెళ్ళంట పాటకి ప్రదర్శించిన నృత్యం ఆకట్టుకొంది. అక్షయ పొట్లూరి ప్రదర్శించిన జింగిల్ బెల్స్ నృత్యం భారతీయ, పాశ్చాత్య పోకడల సమ్మేళనంతో మామూలు కు భిన్నంగా వైవిద్యతను చాటింది. పల్లె సంబరాలు కార్యక్రమ మూలాంశమైన గ్రామీణ, జానపద వినోదాల నేపధ్యానికి, రంగడి (ఆనిమేటెడ్ పాత్ర) ప్రవేశంతో మంచి ఊపు లభించింది.
దర్భా సోదరీమణులు పాడిన సంక్రాంతి గొబ్బిళ్ళ పాట సొంపుగా ఉంటే, ఆంధప్రదేశ్ కళాకారులు హరిదాసుల ఆశీర్వాదాలను, అందరికీ అందించి, ధనుర్మాసపు సంప్రదాయాలను విశదపర్చారు. విశేషించి తెలుగునాట ప్రతి గ్రామంలో సంక్రాంతికి తప్పక దర్శనమిచ్చే, సంక్రాంతి వినోదాలకు పట్టుకొమ్మ అయిన పిట్టల దొరలు అందించిన హాస్యం, వారు పంపించిన ఆహ్లాదం మర్చిపోలేము. పిట్టలదొరలుగా అభినయించిన కళాకారులిద్దరూ అద్భుతంగా పాత్ర పోషణ చేసారు. సంక్రాంతి గీతానికి శ్రీమతి ప్రశాంతి తాడేపల్లి కూర్చిన నృత్యాన్ని చిరంజీవులు సమన్వి, లాస్య, అనన్య చక్కగా అభినయించి కనువిందు చేయగా, తురిమెళ్ళ సోదరీమణులు ప్రదర్శించిన శరణం భవ కూచిపూడి నృత్యం పరిపూర్ణతకు, అభినయ కౌశలానికి అద్దం పట్టింది.
ఇంకా, యువతీమణులు, హాసిని, గాయత్రి భోగి పండుగ విశిష్టతను ఆకర్షణీయంగా చక్కని నృత్యం ద్వారా వివరించారు. 26 మంది మహిళా మణులు పాల్గొని సంక్రాంతి ముగ్గులు వీడియో ప్రదర్శన అందరినీ అబ్బురపరచి, పల్లె సంబరాల కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చికాగో ఆంధ్రా వారి ప్రత్యేక బహుమతిగా కొవిడ్ నిబంధలను పాటిస్తూ తమ సభ్యులందరికీ సంక్రాంతి సందర్భంగా పండగ పిండివంటలు, సీఎఎ వారి తెలుగు క్యాలెండర్ను కూడా ఇంటింటికి అందజేశారు. చికాగో ఆంధ్ర సంఘం చైర్మన్ సుందర్ దిట్టకవి 2021 సంవత్సరానికి అధ్యక్షుడిగాఎన్నికైన శైలేష్ మద్దిని పరిచయం చేసారు. కార్యనిర్వాహక వర్గాన్ని కూడా అందరికి పరిచయం చేసారు.
కూచిపూడినాట్యనిలయం, ఏలూరువారు ప్రదర్శించిన అద్భుతమైన నృత్యనాటిక గంగావతరణం వీక్షకులకు కనువిందు చేసింది. శ్రీమతి దీపరవి సృజనాత్మకమైన అనిమేషన్ టెక్నాలజీ అందించారు. గురు శ్రీమతి స్వర్ణలత బెండాది కూర్చిన నృత్యాలు ఆన్లైన్ వీక్షకుల నుండి ప్రశంసలతోబాటు, వ్యాఖ్యల వర్షం కురిపించాయి. శ్రీమతులు సుందరవల్లి, వాణి దిట్టకవి అందించిన కాన్సెప్ట్, శ్రీ సుందర్ దిట్టకవి కార్యక్రమ వ్యాఖ్యలు అసంఖ్యాక ఆన్లైన్ వీక్షకుల ప్రశంసలు పొందాయి.
ప్రముఖ సంగీతజ్ఞులు సర్వశ్రీ శివ ప్రసాద్ (ఈలపాట), మేడూరి శ్రీనివాస్ (వీణ వాద్యం) కృష్ణ తేజస్వి (గాయకులు), రామనాధ్ కందాళై (కవి), ప్రమతి కందాళై అర్పించిన బాలు గారి పాటల నివాళి ఉద్విగ్నతను కలిగించగా, తెరపై వినిపించిన బాలు గారి సహజ స్వరం, గళం వీక్షకులను ఉద్వేగంతో కదిలించాయి.
మా తెలుగు తల్లికి మల్లె పూదండ పాటకి సీనియర్ సిటిజన్స్ అభినయ ప్రదర్శన మొత్తం కార్యక్రమానికి హైలైట్గా నిలిచింది ప్రఖ్యాత సంగీత దర్శకుడు శ్రీ ఏ.ఆర్. రెహ్మాన్ పాటలతో సి.ఏ.ఏ. మహిళా బృందం ప్రదర్శించిన రెహ్మాన్ రిథమ్ ప్రత్యేక ఆకర్షణ కాగా, చైత్య, శ్రావణిల వీడియో కూర్పు, శ్రీమతి సుచి కోఆర్డినేషన్ ప్రతేకంగా చెప్పుకోవాలి. ఈ పాట రాబోయే భారత రిపబ్లిక్ డే వీక్షకులకు గుర్తు చేస్తూ దేశభక్తి పూరితంగా ముగిసింది.
శివ, శైలేష్ మద్ది సురేష్ హుషారైన సినీ గీతాలకు చేసిన నృత్యాభినయం వీక్షకులకు గిలిగింతలు పెట్టింది. చికాగో ఆంధ్ర సంఘం చేపట్టిన సేవ, ధార్మిక కార్యక్రమాలను, సేవా విభాగపు సంచాలకులు రాజ్ పొట్లూరి సందేశాత్మకంగా వివరించారు. సి.ఏ.ఏ. వారి సేవా నిరతి, తాడేపల్లి గూడెం బుర్ర కథ కళాకారులు గుండెలకు హత్తుకునేలా బుర్రకథ ద్వారా వివరించారు. సేంద్రియ వ్యవసాయ రీతులు, రైతు స్థితిగతులను కార్యక్రమంలో చివరి అంశమైన మరొక బుర్రకథ వివరించింది. చికాగో ఆంధ్ర సంఘం కార్యదర్శి శ్రీ అద్దంకి గౌరీ శంకర్ వందన సమర్పణ చేయగా, చిరంజీవి అనికా కారుమూరి జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ముగిసింది.













