సిఎఎ ఆధ్వర్యంలో ‘పల్లె సంబరాలు’
చికాగో ఆంధ్ర సంఘం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 10 వ తేదీన, హిందు టెంపుల్ ఆఫ్ గ్రేటర్ చికాగో ఆడిటోరియంలో సంక్రాంతి వేడుకలు – ‘‘పల్లె సంబరాలు’’ను ఘనంగా నిర్వహించి తెలుగు వారి మనసులను రంజింపచేశారు. సంస్థ 2024 అధ్యక్షురాలు శ్వేత కొత్తపల్లి, మరియు చైర్మన్ శ్రీనివాస్ పెదమల్లు గారి ఆధ్వర్యంలో, ఉపాధ్యక్షులు శ్రీ కృష్ణ మతుకుమల్లి గారి సహకారంతో జరిగిన ఈ కార్యక్రమాన్ని 1000 మందికి పైగా చికాగో వాసులు విచ్చేసి వీక్షించారు. ఈ కార్యక్రమానికి కాన్సలేట్ జనరల్ ఆఫ్ ఇండియా సోమ్నాధ్ ఘోష్ ముఖ్య అతిధిగా విచ్చేసి అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకెంతో ఆనందం కలిగించిందని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలను జరుపుకోవడం ద్వారా పండుగలని, సాంప్రదాయాలను భావితరాలకు తెలియజేసి, ముందుకు తీసుకెళ్లేందుకు దోహదం చేస్తాయంటూ నిర్వాహకుల ప్రయత్నాన్ని అభినందించారు.
హేమంత్ తలపనేని గారి ఆధ్వర్యంలో, శైలేష్ మద్ది, మురళీ రెడ్డివారి, పద్మారావు అప్పలనేని, నరసింహరావు వీరపనేని, విజయ్ మన్నేపల్లి, దివిజ చల్లా, శ్రియ కొంచాడ, స్మరణ్ తాడేపల్లి మున్నగు వారు సభ్యత్వ నమోదు మరియు కార్యక్రమ రిజిస్ట్రేషన్ నిర్వహిస్తు విచ్చేసిన వారందరినీ ఆప్యాయంగా స్వాగతించారు. శిరీషా పద్యాల, అన్వితా పంచాగ్నుల సభ్యులందరికీ శైలేష్ మద్ది గారు రూపకల్పన చేసిన చికాగో ఆంధ్రా సంఘం వారి తెలుగు క్యాలెండర్ మరియు అయోధ్య రామయ్య అక్షింతలు అందజేసారు. మురళీ రెడ్డివారి వెబ్ రిజిస్ట్రేషన్, క్యూఆర్ కోడ్ అందించి కార్యక్రమం సాఫీగా సాగేలా తోడ్పడ్డారు.
దీపప్రజ్వలనతో కార్యక్రమాన్ని మొదలుపెట్టి, తెలుగుదనం ఉట్టిపడేలా అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో, చూడ ముచ్చటైన సాంస్కృతిక కార్యక్రమాలతో అందరినీ అలరించారు. భారత భారతీ మ్యూజిక్ స్కూల్ వల్లీశ్వరి మూర్తి గారి విద్యార్థులు మరియు గురుకిృప మ్యూజిక్ స్కూల్ వైదేహి చంద్రశేఖరన్ గారి విద్యార్థులు ఎంతో చక్కటి సాంప్రదాయ సంగీత ప్రార్థనా గీతాలు ఆలపించి సాంస్కృతిక కార్యక్రమాలను మొదలు పెట్టారు.
కల్చరల్ టీం శైలజ సప్ప, శ్రీ స్మిత నండూరి, అనూష బెస్త సమన్వయించగా, శ్రీనివాస్ పద్యాల, శిల్పా రామిశెట్టి, లోహిత గంపాల, ప్రియ మతుకుమల్లి, మనస్వి తూము, గీతిక ఐనపూడి, హాసిని దేవెళ్ళ సహకరాన్నందించారు. వేణుగోపాల్ పోకల, శ్రీలక్ష్మి చిట్టినేని ఎంతో జనరంజకంగా, వ్యాఖ్యానాన్ని అందించారు. అంతే గాక ఈ సంక్రాంతి సంబరాలకి విచ్చేసిన వారికి తమ కనులకు విందైన ‘పల్లె సంబరాలు’ అను ప్రత్యేక ప్రదర్శనతో అతిథులని ఎంతో ఆనందపరిచారు. సుమారు 70 మంది బాలబాలికలు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్న ఈ కార్యక్రమం అచ్చమైన తెలుగు వాతావరణాన్ని కళ్ళకు కట్టింది. గురు జానకి ఆనందవల్లి నాయర్ మరియు గురు శోభ తమ్మన గారి విద్యార్ధులు ప్రదర్శించిన కూచిపూడి నృత్య రూపకాలు, భరతనాట్య గురు ఆశా అడిగ ఆచార్య గారి విద్యార్ధి కుమారి అదితి ఆచార్య ప్రదర్శించిన ‘‘హిమగిరి తనయ’’ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసి వారి ప్రశంసలతో నాటి కార్యక్రమానికి మకుటాయమానంగా నిలిచాయి. స్వదేశ్ మీడియా వారు ఈ కార్యక్రమానికి ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ సేవలనందించారు. ఈ కార్యక్రమానికి లక్ష్మీనాగ్ సూరిభొట్ల గారు ఎంతో సృజనాత్మకత తో ప్రొమోషనవ్ వీడియోలను విడుదల చేసారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసి స్పాన్సర్ల ను ప్రభాకర్ మల్లంపల్లి గారు సమన్వయించగా, తమ విరాళాలతో సంస్థ అభ్యున్నతిని ఎంతో ప్రోత్సహిస్తున్న స్పాన్సర్ల ను శ్వేత కొత్తపల్లి, వేదిక పైకి ఆహ్వానించి కృతజ్ఞతలు తెలిపి పూలగుచ్చాలతో సత్కరించారు. ఇటీవల చికాగో సంఘం వారు నిర్వహించిన ముగ్గుల పోటీల్లో గెలిచిన వారందరికీ పల్లె సంబరాల వేదిక పై ‘‘ఆనంది ఫాషన్స్ – కల్పన గారు’’ బహుమతులు అందజేశారు. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న చిన్నారులందరికీ బహుమతులు అందజేసి వారిని ప్రోత్సహించారు. నరేష్ చింతమాని ఆధ్వర్యంలో, సురేశ్ ఐనపూడి గారి సహకారంతో, స్థానిక ఇండియన్ రెస్టారెంట్ వారు అందించిన షడ్రసోపేతమైన విందు భోజనం, పండుగను మళ్ళీ తలపించే విధంగా ఆహూతులందరికీ ఎంతో ఆప్యాయంగా వడ్డించారు. పిల్లలకోసం పిజ్జా ట్విస్ట్ రెస్టారెంట్ వారు పిజ్జాలు అందజేసారు.
సుజాత అప్పలనేని, తమిశ్ర కొంచాడ, భాగ్యలక్ష్మి సంగెం, శ్వేత కొత్తపల్లి, శృతి కూచంపూడి, సౌమ్య బొజ్జ, స్రవంతి గ్రంధి, ప్రియ మతుకుమల్లి, మల్లీశ్వరి పెదమల్లు, హరిణి మేడ, రాజ్యలక్ష్మి కొండిశెట్టి, అనూష బొజ్జ మున్నగు వారు తయారు చేసిన నేతి అరిశలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
అధ్యక్షురాలు శ్వేత కొత్తపల్లి, చైర్మన్ శ్రీనివాస్ పెదమల్లు ప్రేక్షకులను పల్లె సంబరాల కార్యక్రమానికి స్వాగతించి టీమ్ 2024 నిర్వహించనున్న కార్యక్రమాలను వివరించారు. 2022-2023 సంవత్సరములకు చైర్మన్ గా పని చేసిన సుజాత అప్పలనేని గారు తమ అపార అనుభవంతో సంస్థ పురోభివృద్ధికి కృషి చేసారని తెలుపుతూ వారికి మొమెంటో బహూకరించారు. సంస్థ యొక్క ట్రస్టీలు శ్రీనివాస్-మల్లేశ్వరి పెదమల్లు, సుజాత-పద్మారావు అప్పలనేని, రాఘవ-శివబాల జాట్ల, దినకర్-పవిత్ర కరుమూరి, ఉమ కటికి కార్యక్రమ నిర్వహణకు అన్ని విధాలా తమ సహకారాన్నందించారు.
సంస్థ యొక్క సేవావిభాగమైన చికాగో ఆంధ్ర ఫౌండేషన్ (CAF) నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను, మును ముందు చేపడుతున్న ప్రాజెక్ట్ లను సవితా మునగ వివరించారు. చికాగో ఆంధ్ర ఫౌండేషన్ (CAF) తరఫున సవితా మునగ, అనురాధ గంపాల ఫుడ్ డ్రైవ్, శారీ రాఫిల్ మరియు చేనేత టేబుల్ రన్నర్స్ స్టాల్ విరాళాల కొరకు అమ్మకానికి పెట్టారు. విరాళాల సేకరణ ద్వారా సమకూర్చిన ఫుడ్ ప్యాకెట్స్,ధనము పేదవారికి అందజెయనున్నారు. సంస్థ కార్యదర్శి గిరి రావు కొత్తమాసు గారు, ఎంతో ఓపికగా కార్యక్రమాన్ని ఆసాంతం తిలకించి వినోదాన్ని ఆస్వాదించిన ప్రేక్షకులకు, అతిథి మహాశయులకూ ధన్యవాదాలు తెలిపారు.







