కరోనాతో ఎన్నారై మృతి
అమెరికాలో కరోనా సోకి ఓ ఎన్నారై మరణించాడు. ‘ది బాంబే క్యాంటీన్’ సహ వ్యవస్థాపకుడు, ప్రముఖ చెఫ్ ఫ్లాయిడ్ కార్డోజ్(59).. ఈ మధ్యే అమెరికా వెళ్లాడు. ఈ నేపథ్యంలో ఆయనకు వైరస్ సోకింది. మార్చి 18న ఈ విషయాన్ని ఇన్స్టాగ్రాం ద్వారా స్వయంగా ఆయనే వెల్లడించారు. న్యూయార్క్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు కూడా తెలిపారు. కాగా.. చికిత్స పొందతూ ఆయన కన్నుమూశారు. ఈ విషయాన్ని ఫ్లాయిడ్ కార్డోజ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న హంగర్ ఐఎన్‌సీ. హాస్పిటాలిటీ సంస్థ ధ్రువీకరించింది. ‘‘చెఫ్ ఫ్లాయిడ్ కార్డోజ్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారని తెలియజేయడానికి చింతిస్తున్నాం’’అని ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా బాంబేలో పుట్టిన ఫ్లాయిడ్ కార్డోజ్ తొలుత బయోకెమిస్ట్‌గా శిక్షణ పొందారు.
అనంతరం తన అభిరుచికి అనుగుణంగా చెఫ్‌గా మారారు. భారత్, స్విట్జర్లాండ్‌లో శిక్షణ పొంది.. న్యూయార్క్‌కు షిఫ్ట్ అయ్యారు. ప్రఖ్యాత.. ‘‘టాప్ చెప్ మాస్టర్’’ టైటిల్ పొంది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. కాగా భారత సంతతికి చెందిన మరో సెలబ్రిటీ చెఫ్ పద్మా లక్ష్మి ఫ్లాయిడ్ కార్డోజ్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ‘‘ఫ్లాయిడ్ మనల్నందరినీ గర్వపడేలా చేశారు. న్యూయార్క్ వాసులు ఆయన చేతి రుచికరమైన భోజనాన్ని ఎన్నడూ మరచిపోలేరు. తన చిరునవ్వుతో చుట్టూ ఉన్నవారిని సంతోషంగా ఉంచేవారు. ఆయన మరణం తీరని లోటు’’అని ట్విటర్లో విచారం వ్యక్తం చేశారు. ఇక బాలీవుడ్ తారాగణం సైతం ఫ్లాయిడ్ మృతికి సంతాపం తెలిపింది.













