డొనాల్డ్ ట్రంప్… అల్లుడికి చిక్కులు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీసా విధానాలను కఠినతరం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆయన అల్లుడు, శ్వేతసౌధం సలహాదారు జారెద్ కుష్నర్ చిక్కుల్లో పడుతున్నారట. వీసా విధానాలతో కుష్నర్కు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీకి సమస్యలు ఎదురవుతున్నాయి. కుష్నర్ కంపెనీ ఫెడరల్ వీసా ప్రోగ్రాంను ఉపయోగిస్తోంది. ఈ కంపెనీ న్యూజెర్సీలోని రెండు లగ్జరీ టవర్స్‌కు చైనా ఇన్వెస్టర్ల నుంచి 150మిలియన్ డాలర్లు తీసుకుంది. కాగా ఫెడరల్ వీసా విధానంలో ఈబీ-5 ప్రోగ్రాం ద్వారా విదేశీయులు కనీసం 5లక్షల డాలర్ల పెట్టుబడులు పెడితే వీసాను సులభంగా పొందవచ్చు. దీన్నే వీసా ఫర్ క్యాష్ అని కొందరు పిలుస్తారు. అయితే ఇప్పుడు వీసా నిబంధనలను కఠినతరం చేయడంతో ఈబీ-5 ప్రోగ్రాంలోనూ మార్పులు జరగనున్నాయి. దీంతో కుష్నర్ కంపెనీ పెట్టుబడులను కోల్పోయే అవకాశాలు కన్పిస్తున్నాయి. దీంతో ట్రంప్ నిర్ణయంపై కుష్నర్ సోదరి నికోలే అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే దీనిపై అటు కుష్నర్గానీ, ఇటు కంపెనీ గానీ అధికారికంగా స్పందించలేదు. డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకాను కుష్నర్ వివాహం చేసుకున్న విషయం తెలిసింది. వీసా నిబంధనల్లో కుష్నర్ ఎలాంటి జోక్యం చేసుకోలేదని శ్వేతసౌధం ఓ ప్రకటనలో తెలిపింది.













