అమెరికా నుంచి ఆయుధాలు …
చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత సైన్యం కోసం అమెరికా నుంచి రూ.2,290 కోట్లు విలువ చేసే ఆయుధాలను కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని రక్షణ ఉత్పత్తుల కొనుగోలు మండలి (డీఏసీ) ఉత్తర్వులిచ్చింది. ఈ ఆయుధాల్లో 72 వేల అధునాతన రైఫిళ్లు (సిగ్ సౌయెర్) ఇప్పటికే భారత సైన్యానికి చేరాయి. వీటి విలువ రూ.780 కోట్ల. దీంతో పాటు రూ.970 కోట్లతో దేశీయంగా తయారైన యాంటీ- ఎయిర్ ఫీల్డ్ ఆయుధాలను కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. మరో 880 కోట్లతో ఇజ్రాయెల్ నుంచి లైట్ మెషీన్ గన్ (ఎల్ఎంజీ)లను కొనుగోలు చేయనుంది. ఇవేకాకుండా రష్యా సాంకేతిక పరిజ్ఞానంతో 6.71 లక్షల ఏకే-203 రైఫిళ్లను అమేఠీలోని కోర్వా అర్డినెన్స్ ప్యాక్టరీలో తయారు చేస్తోంది. వీటి విలువ రూ.4,358 కోట్లుగా ఉంటుందని అంచనా.













