అమెరికాలోని విద్యార్థుల భద్రతకు కేంద్రం భరోసా
అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించడానికి వెళ్లి నిర్బంధానికి గురైన విద్యార్థుల భద్రతకు కేంద్ర ప్రభుత్వం భరోసానిచ్చింది. ఉన్నత చదువుల కోసం అమెరికాలోని ఓ విశ్వవిద్యాలయంలో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అక్కడి అధికారులు వేధిస్తున్నారని, పలువురు విద్యార్థులను అమెరికా భద్రతా విభాగం అదుపులోకి తీసుకున్న అంశంపై దృష్టి సారించాలని కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు, భారత్‌లోని ఆ దేశ రాయబారి కెన్నెత్ జస్టర్‌కు ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు గత జనవరి 31న లేఖలు రాశారు. విద్యార్థులపై వేధింపులు ఆపేలా చర్యలు చేపట్టాలని వారికి న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కంభంపాటి లేఖపై సుష్మా స్వరాజ్ స్పందించారు. నిర్భంధంలో ఉన్న విద్యార్థుల బాగోగులు చూడడమే తమ ప్రాధాన్యత అని ఆమె లేఖలో హామీ ఇచ్చారు.
విశ్వవిద్యాలయం పేరుతో నమోదు చేసుకున్న విద్యార్థులకు ఏజెన్సీలు, కన్సల్టెన్సీలు మరో విధంగానైనా న్యాయం జరిగేలా చూడాలని అమెరికా రాయబార కార్యాలయ అధికారులను కోరినట్టు తెలిపారు. కేంద్ర విదేశాంగ శాఖ రాయబారులు అమెరికాలోని భారతీయ సంస్థలు, సంఘాల ప్రతినిధులలో సంప్రదింపులు జరుపుతూ నిర్బంధంలో ఉన్న విద్యార్థులకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారని పేర్కొన్నారు. వాషింగ్టన్ డీసీలోని తమ రాయబార కార్యాలయంలో 24 గంటల హెల్ప్ లైన్‌ను ఏర్పాటు చేసి విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తున్నామని లేఖలో వివరించారు.













