అమరావతిలో అమెరికా ఆసుపత్రికి శంకుస్థాపన
అమరావతిలో అమెరికా ఎన్నారైలు నిర్మించతలపెట్టిన అమరావతి అమెరికన్ హాస్పిటల్స్ నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు నాయుడు రిమోట్ ఆప్షన్ ద్వారా శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఇబ్రహీంపట్నంలోని 20 ఎకరాల స్థలంలో రూ.600 కోట్ల పెట్టుబడితో 3 దశల్లో 700 పడకలతో ఈ అమరావతి అమెరికన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AAIMS) సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు కానుంది. 2019 మార్చి నాటికి ఈ ఆస్పత్రి మొదటి దశ నిర్మాణం పూర్తవుతుందని అంచనా.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కోట్లాది రూపాయల ఖర్చుతో పేదలకోసం ప్రత్యేకంగా ఆసుపత్రి నిర్మాణాన్ని చేపడుతున్నందుకు డాక్టర్ గొర్రెపాటి నవనీత కృష్ణను అభినందించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే ఎన్నారైలకు అన్నీ సౌకర్యాలను సమకూరుస్తామని చెప్పారు. ప్రపంచంలోనే నెం.1 రాష్ట్రంగా ఎపిని తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. భవిష్యత్తులో గుండె ఆపరేషన్లకు అమెరికా నుంచి అమరావతి రావాలి అని ఆకాంక్షింస్తున్నట్లు చెప్పారు.. రాజధాని ప్రాంతం వైద్యానికి ప్రసిద్ధి చెందాలని సంకల్పించామని, దానికి అనుగుణంగా 10 అత్యుత్తమ యూనివర్సిటీల్లో నాలుగు ఏపీకి వచ్చాయని అన్నారు.. 13 వైద్య విశ్వవిద్యాలయాలు, అత్యంత అధునాతన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఇక్కడ ఏర్పాటు కానున్నాయని తెలిపారు. అమెరికాలో వైద్య ఖర్చు ఎక్కువని, అదే అమరావతిలో ఖర్చు తక్కువగా ఉంటుందన్నారు.
రాజధాని నిర్మాణమనేది చాలా కష్టతరమైన విషయమని, అలాంటి కష్టతరమైన రాజధాని నిర్మాణాన్ని ప్రపంచంలోనే ఆధునిక రాజధానిగా నిర్మించాలని సంకల్పించామని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
ఎయిమ్స్ కు అవసరమైన భూమి, ఇతర అనుమతులన్నీ ఒక్క రూపాయి తీసుకోండా ఏపీ ప్రభుత్వ ఇచ్చిందని నవనీత కృష్ణ పేర్కొన్నారు. రాష్ట్ర విభజన సమయంలో అమెరికాలో ఉన్న తాము చాలా బాధపడ్డామని, జన్మభూమికి ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నామన్నారు. అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, వైద్య కళాశాల ప్రారంభించాలని భావించి మంత్రి దేవినేని ఉమకు చెబితె, ఏం కావాలంటే అది ఇప్పిస్తాం రండి అన్నారన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు కామినేని శ్రీనివాస్, దేవినేని ఉమామహేశ్వరరావు, భూమా అఖిలప్రియ తదితరులతోపాటు డా. గొర్రెపాటి రంగనాథ బాబు, చలసాని మల్లిఖార్జునరావు, మొక్కపాటి చంద్రశేఖర్ ఇతరులు పాల్గొన్నారు.













