పద్మజారెడ్డిని సత్కరించిన క్యాట్స్
ప్రముఖ నృత్యకళాకారిణి పద్మశ్రీ డా. పద్మజారెడ్డిని వర్జీనియాలో క్యాపిటల్ ఏరియా తెలుగు సొసైటీ (క్యాట్స్) నాయకులు ఘనంగా సత్కరించారు. జూలై 9వ తేదీన చాంటిల్లీ, వర్జీనియాలోని స్థానిక అతిధి రెస్టారెంట్ వేదిక వద్ద మీట్ అండ్ గ్రీట్ పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమెను సత్కరించారు. ఈ కార్యక్రమానికి 150 మందికి పైగా హాజరయ్యారు. జనరల్ సెక్రటరీ పార్థ బైరెడ్డి ప్రెసిడెంట్ సతీష్‌ని, ట్రస్టీస్‌ను, ఫౌండర్స్‌ను గౌరవ అతిథి పద్మశ్రీ డా. పద్మజా రెడ్డిని స్టేజి మీదకి ఆహ్వానం పలుకుతూ ఐదు దశాబ్దాలుగా తన జీవితాన్ని నృత్యానికే అంకితం చేసిన కూచిపూడి డాక్టర్ పద్మజా రెడ్డి ప్రతిభను తెలియజేస్తూ, కాకతీయ రాజవంశం యొక్క వారసత్వాన్ని దాని వైభవాన్ని ప్రపంచానికి తన నృత్యాలతో చాటి చెప్పారని కొనియాడారు.
క్యాట్స్ ప్రెసిడెంట్ సతీష్ వడ్డి మాట్లాడుతూ కళారంగానికి జీవితాన్ని త్యాగం చేయడం అనేది ఎనలేని సంతృప్తిని ఇస్తుందన్నారు. ఆమె తన 40 ఏళ్ల నృత్య ప్రయాణంలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు అని తెలిపారు.
ట్రస్టీ సుధా రాణి మాట్లాడుతూ సాధన చేయడం, అన్వేషించడం, ప్రపంచ ప్రసిద్ధి చెందడం ద్వారా లక్ష్యంగా చేసుకున్నారని, ఎంతో మంది విద్యార్థులకు ఆమె సేవ చేయడం నిజంగా తెలుగు వారికి గర్వకారణం. వర్జీనియా క్యాపిటల్ ఏరియా లో లోకల్ కూచిపూడి డాన్స్ స్కూల్ టీచర్స్ మల్లిక, సాయి కాంత, స్వాతి, మంజులను కూడా వేదిక మీదకు ఆహ్వానించారు.
ప్రముఖ కూచిపూడి డాన్సర్ మల్లికా రాంప్రసాద్ మాట్లాడుతూ పద్మజా గారితో ఆమె జీవితం ఎలా సాగిందో విశదీకరించారు. మేము ఆమెను విద్యార్థిగా, ప్రదర్శకురాలిగా, ఉపాధ్యాయునిగా, సలహాదారుగా మరియు పరిశోధకురాలుగా చూశామని చెప్పారు. ఆమె కాకతీయతను శుద్ధి చేసి పునర్ నిర్వచించారు అని కొనియాడారు.
అటు పిమ్మట పద్మజా రెడ్డి మరియు మల్లికా గారు కలిసి భామాకలాపంలో ఒక చిన్న నృత్య ప్రదర్శనను చేసి ప్రేక్షకులకు కనువిందు చేశారు.
క్యాట్స్ ఫౌండర్ రామ్ మోహన్ కొండ మాట్లాడుతూ ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలి అనే మాటకు సరైన నిర్వచనం మన పద్మజా రెడ్డి అని పేర్కొన్నారు.
పద్మజా రెడ్డి మాట్లాడుతూ ఈ కాకతీయ నృత్యానికి మూల కారణం ఏమిటో విశదీకరిస్తూ ‘‘కాకతీయం’’ అంటే గొందలి, రసకం, చరణ, పేరిణి శివతాండవం వాటి కలయిక గా పేర్కొన్నారు. క్యాట్స్ వారు విద్యార్థులతో కలిసి ప్రశ్నల రూపంలో నా జీవిత శైలిని మరియు కాకతీయంపై నా ప్రేరణ అడిగి వారికి ఉన్న సందేహాలను తెలుసుకున్నారు. అంతే కాకుండా ఆమె తన నృత్య ప్రదర్శనలద్వారా భృణ హత్యలు (ఆడశిశువు) మరియు ఎయిడ్స్ మీద అవగాహన కలిగించే అంశాలను, జాతీయ సమైక్యతా స్ఫూర్తిని పెంపొందించే నృత్యరూపకాలను ప్రజల్లో ఒక చైతన్యంలా తీసుకుని రావడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికీ క్యాట్స్ ట్రస్టీలు రామ్మోహన్ కొండ, మధు కోలా, భాస్కర బొమ్మారెడ్డి, సలహాదారు గోపాల్ నున్న, రమేష్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ టీమ్ లావణ్య తేలు, గీత, అవని, లక్ష్మీకాంత్, శరత్, సందీప్, సాయి, ఇఎస్కెలతో పాటి లోకల్ లీడర్ శ్రీధర్ నాగిరెడ్డి గారు, మీడియా మిత్రులు వేణు నక్షత్రం హాజరు అయ్యారు. చివరిగా క్యాపిటల్ ఏరియా తెలుగు సొసైటీ పెద్దలు అందరూ కలిసి పద్మజా రెడ్డిని శాలువా వేసి స్మారక చిహ్నం (ప్లేక్) మరియు పుష్ప గుచ్ఛం అందించి సత్కరించారు. ప్రేక్షకులందరూ కరత్వాళధ్వనులతో ఆమెకు అభినందనలు తెలిపారు.













