ఈబీ-5 వీసాలకు డిమాండ్
హెచ్ 1 బీ వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన నిబంధనలు ప్రవేశపెట్టడంతో పెట్టుబడి ఆధారంగా జారీ చేసే వీసాలకు అనూహ్యంగా డిమాండ్ నెలకొన్నది. అమెరికాలో 5 లక్షల నుంచి 10 లక్షల డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టేవారికి ఇచ్చే ఈబీ-5 వీసాలకోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయని కానామ్ ఇన్వెస్టర్ సర్వీసెస్ ఎల్ఎల్సీ వైస్ ప్రెసిడెంట్ అభినవ్ లోహియా చెప్పారు. 2016లో 50 మంది పెట్టుబడిదారులు దరఖాస్తు చేసుకోగా, ఆ తర్వాతి ఏడాదిలో 97 వచ్చాయని, ప్రస్తుత సంవత్సరంలో 200 వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ అమెరికా ఈబీ-5 వీసా జారీ అయిన వ్యక్తి ఐదేండ్ల పాటు అక్కడే నివసిస్తే గ్రీన్‌కార్డు కూడా లభించనున్నదని, గృహాన్ని కూడా కొనుగోలు చేసుకునే వీలుంటుందన్నారు. ఈ వీసాల జారీ ద్వారా అమెరికాకు వచ్చే వారిలో భారత్ మూడో స్థానంలో ఉన్నదని, తొలి స్థానంలో వియత్నాం, ఆ తర్వాతి చైనా ఉందన్నారు. ఈ వీసా కింద పెట్టుబడిదారుడితో పాటు ఆయన భార్య, 21 ఏండ్ల కంటే తక్కువ వయసు ఉన్న పెళ్లి కాని యువతీ యువకులను తీసుకెళ్లవచ్చును. ప్రస్తుతం ఈ వీసాల కింద ఉన్న మార్గదర్శకాలను మార్చే అవకాశం ఉన్నదని, సెప్టెంబర్ 30 నుంచి కొత్త నిబంధనలు ప్రకారం పెట్టుబడుల పరిధిని మరింత పెంచే అవకాశం ఉందన్నారు.













