Deepavali: ఎల్క్ గ్రోవ్ సిటీలో ఘనంగా దీపావళి వేడుకలు
కాలిఫోర్నియాలోని ఎల్క్ గ్రోవ్ నగరంలో దీపావళి (Deepavali) సంబరాలు ఘనంగా జరిగాయి. డిస్ట్రిక్ట్ 56 వద్ద జరిగిన 6వ వార్షిక దీపావళి వేడుకలకు వందలాది మంది తరలివచ్చారు. సిటీ ఆఫ్ ఎల్క్ గ్రోవ్ డైవర్సిటీ & ఇంక్లూజన్ కమిషన్, యూఎస్ఏ సనాతన్ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమం.. దీపావళి పండుగ గొప్పతనాన్ని చాటింది. సాంస్కృతిక ప్రదర్శనలు, మెరిసే ఫ్యాషన్ షో, మత సామరస్యాన్ని తెలిపే విధంగా నిర్వహించిన దీపాలు వెలిగించే కార్యక్రమం అందర్నీ ఆకర్షించాయి. ఈ సంబరాల్లో పాల్గొన్న అందరికీ ఉచిత డిన్నర్, దీపావళి స్వీట్స్ అందించారు.
ఈ వేడుకల లీడ్ ఆర్గనైజర్ భవిన్ పారిఖ్ (Bhavin Parikh) మాట్లాడుతూ.. “ఈ పండుగ చీకటిపై వెలుగు, అజ్ఞానంపై జ్ఞానం, చెడుపై మంచి సాధించిన విజయాన్ని జరుపుకుంటుంది. ఈ వేడుకలకు అందరూ కలిసి రావడం చాలా సంతోషంగా ఉంది” అని తెలిపారు. ఎల్క్ గ్రోవ్ మేయర్ బాబీ సింగ్-అలెన్ (Bobbie Singh-Allen) మాట్లాడుతూ.. “మన నగరం అమెరికాలోనే అత్యంత వైవిధ్యభరితమైన వాటిలో ఒకటి. ఇది అందరికీ స్వాగతం పలికే నగరం” అన్నారు. ఇటీవలే కాలిఫోర్నియాలో దీపావళిని (Deepavali) ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటిస్తూ.. అసెంబ్లీ బిల్ 268పై గవర్నర్ గావిన్ న్యూసమ్ (Governor Gavin Newsom) సంతకం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ దీపావళి వేడుకలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వచ్చే జనవరి 1 నుండి కాలిఫోర్నియాలో దీపావళిని (Deepavali) కూడా రాష్ట్ర సెలవుదినంగా జరుపుకుంటారు.








