ట్రంప్ ఖాతాలో మరో విజయం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన బ్రెట్ కేవనా వివాదాలు, నిరసనల నడుమ సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ప్రమాణం చేశారు. దీంతో చట్టసభ ఎన్నికలకు ముందుగా ట్రంప్ ఖాతాలో మరో విజయం నమోదైనట్లుయింది. కేవనాతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ ప్రమాణం చేయించారు. 50-48 ఓట్లతో కేవనా నియామకంపై సెనేట్ ఆమోదముద్ర వేసిన కొన్ని గంటలకే తాజా పరిణామం చోటుచేసుకుంది. ఇంత తక్కువ ఓట్లతో అధ్యక్షుడు ప్రతిపాదించిన వ్యక్తిపై ఆమోదముద్ర పడటం 1881 తర్వాత ఇదే తొలిసారి. ప్రమాణం అనంతరం కేవనాకు అభినందనలు తెలుపుతూ ట్రంప్ ట్వీట్ చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తడంతో కేవనా నామినేషన్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆరోపణలను కేవనా ఖండించారు. విపరీత ఒత్తిళ్లు నడుమ వీటిపై విచారణ చేపట్టాలని ఎఫ్బీఐను ట్రంప్ ఆదేశించారు. గత వారమే సెనేట్ కమిటికీ ఎఫ్బిఐ నివేదిక సమర్పించింది. ఈ ఆరోపణల్లో పసలేదని దీనిలో ఎఫ్బీఐ పేర్కొంది.













