కరోనా పరీక్షలను తగ్గించమని ట్రంప్‌కు ఎవరు చెప్పారు.. ఫౌచీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దురుసు మరోసారి అమెరికాకు తలనొప్పి తెచ్చింది. ఆయన ఇటీవల ఓక్లహోమాలో ఒక ర్యాలీలో మాట్లాడుతూ కరోనా పరీక్షలను తగ్గించాలని తన కార్యవర్గాన్ని ఆదేశించారు. దీనిపై అమెరికాలోని ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియన్ డిసీజెస్ డైరెక్టర్ డాక్టర్ ఆంటోని ఫౌచీ అసహనం వ్యక్తం చేశారు. కొవిడ్ వ్యాప్తిపై అమెరికా కాంగ్రెస్ కమిటీ చేపట్టిన దర్యాపు సందర్భంగా ఆయన ఈ విధంగా స్పందించారు. నాకు తెలిసినంత వరకు మాలో ఎవరూ కరోనా పరీక్షలను తగ్గించమని చెప్పలేదు. మేము ఇంకా పెంచాలని ప్రభుత్వానికి సూచించాము అని ఆయన కాంగ్రెస్ కమిటీకి వివరణ ఇచ్చుకున్నారు. త్వరలో అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని ఫౌచీ ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న రోజులు అమెరికాకు గడ్డుకాలమని ఫౌచీతో పాటు ప్యానల్ సభ్యులు కూడా అభిప్రాయపడ్డారు.













