అమెరికా పర్యటన రద్దు చేసుకున్న బోల్సనారో
న్యూయార్క్ నగరంలో తన గౌరవార్ధం ఏర్పాటు చేసిన విందులో ఆతిథ్యం ఇచ్చేందుకు ఆయా యాజమన్యాలు నిరాకరించటంతో బ్రెజిల్ అధ్యక్షుడు జియర్ బోల్సనారో తన అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రాయోజక సంస్థలు, నిర్వాహకులు, న్యూయార్క్ నగర మేయర్‌తో సహా మరికొన్ని గ్రూపులు దాడి చేసే అవకాశం వుండటంతో అధ్యక్షుడు బోల్సనారో ఈ విందుకు హాజరు కావటం లేదని ఆయన ప్రతినిధి జనరల్ ఒటావియో రెగో బరోస్ ఒక ప్రకటనలో వెల్లడించారు. అమెరికా పర్యటనలో తన గౌరవార్థం ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి ఆతిథ్యం ఇచ్చేందుకు ఆయా ప్రదేశాల యాజమాన్యాలు నిరాకరించటంతో చివరి నిమిషంలో బోల్సనారో తన అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నట్లు బ్రెజిల్ అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనలో వివరించింది.













