డాలస్ లో జాతిపితకు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి ఘన నివాళి
డాలస్ టెక్సాస్: మే 29 వ తేదీన, అమెరికాదేశ సంరక్షణ కోసం అసువులు బాసిన అమరవీరులకు సంస్మరణ దినోత్సవాన్ని పాటిస్తూ దేశమంతటా వారికి నివాళులు అర్పిస్తున్న తరుణంలో డాలస్ నగరంలో నెలకొని ఉన్న అమెరికా లోనే అతిపెద్దదైన మహాత్మా గాంధీ మెమోరియల్ వద్దవిశ్వశాంతికై తీవ్ర కృషి చేసి నేలకొరిగిన జాతిపిత మహాత్మా గాంధీకి పుష్పాంజలి ఘటించడం సముచితంగా ఉందని మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ చైర్మన్ డాక్టర్. ప్రసాద్ తోటకూర అన్నారు. వేదాలు, ఉపనిషత్తులు, భారత, భాగవత పురాణ, ఇతిహాసాలు భగవద్గీత, బ్రహ్మ సూత్రాల్లాంటి అనేక ఆధ్యాత్మిక విషయాల పై వ్యాఖ్యానాత్మక ప్రవచనా పరంపరలతో కోట్లాది హృదయాల్లో భక్తి ప్రపత్తులు నింపినఒక మహా స్ఫూర్తి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు మహాత్మాగాంధీకి శ్రద్ధాంజలి ఘటించడానికి విచ్చేయడం సంతోషమని డాక్టర్. ప్రసాద్పేర్కొన్నారు. మహాత్మా గాంధీ తాను చెప్పిందే స్వయంగా ఆచరించేవారని, తాను ఆచరించిందే చెప్పేవారని, అనునిత్యం సమాజ శ్రేయస్సే శ్వాసగా తన జీవితాన్ని అంకితం చేశారని డాక్టర్. తోటకూర అన్నారు.
కేవలం సనాతన ధర్మ విలువలను, వైశిష్ట్యాలను చాటి చెప్పడం, ఆధ్యాత్మిక ప్రభోధనలే గాక, ఆర్ధికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉపకార వేతనాలుఅందించడం, వివిధ భారతీయ కళలలో నిష్ణాతులైన వారికి పురస్కారాలు అందచేయడం, ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం, గోసంరక్షణాబాధ్యతలు చేపట్టడం అనే విషయాలే ధ్యేయంగా ఋషిపీఠం అనే ధార్మిక సంస్థ ద్వారా సామాజిక సేవ చేస్తున్న బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారి కృషి ఎంతైనా అభినందనీయమని డాక్టర్. ప్రసాద్ తోటకూర కొనియాడారు.
డాక్టర్. సామవేదం షణ్ముఖ శర్మ గారు మాట్లాడుతూ డాలస్ నగరంలో అన్ని జాతుల, మతాల, ప్రాంతాల ప్రజలు కలిసికట్టుగా ముందుకు వచ్చి విశ్వశాంతికై పాటుబడిన మహనీయుడు మహాత్మా గాంధీ నిలువెత్తు విగ్రహాన్ని ఇర్వింగ్ పట్టణం లో సుందరమైన ఉద్యానవనంలో నెలకొల్పుకోవడంలో ప్రధాన పాత్ర వహించిన ఛైర్మన్ డాక్టర్. ప్రసాద్ తోటకూర, కార్యదర్శి రావు కల్వల కృషి శ్లాగనీయం అని అన్నారు.
“గాంధీ సిద్ధాంతాలలో ప్రముఖమైనవి సామరస్యం, శాంతి, భిన్నత్వం లో ఏకత్వం. భగవద్గీత లాంటి సనాతన ధర్మాలలో కూడా ఇవే చెప్పబడ్డాయి. ఇక్కడి విగ్రహ విశేషం ఏమిటంటే గాంధీ చేతిలో భగవద్గీత ఉండడం. భారతదేశపు హృదయమే భగవద్గీత, దాన్ని తన చేతిలో పట్టుకొని చేతలోచూపించారని అన్నారు. గాంధీ స్వచ్ఛ భారతానికై కలలు గన్నారని, ప్రజల్లో శుభ్రత పట్ల ఒక అవగాహన కలిగించడానికి తానే స్వయంగా పారిశుధ్యకార్యక్రమాలు చేసేవారని, ఇప్పుడు మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ కూడా అదే బాటలో పయనించడం విశేషo. మహాత్మా గాంధీ గోసంరక్షణ జరగాలని, గోసంరక్షణ అనేది ఒక మతానికి సంబంధించినది కాదని, అది భారతీయత కు సంబంధించినదని, స్వాతంత్రం వచ్చిన తరువాత మొట్ట మొదటి సంతకం గోవధ నిషేధం పై జరగాలని ఆశించారు. ప్రస్తుతం ఆ గోవధ నిషేధ ఆశయ సాధనలో ప్రభుత్వం అడుగులు వేయడం సంతోషదాయకం. మహాత్మా గాంధీ అన్ని మతాలను సమంగా గౌరవించాలి గాని మత మార్పిడులను ప్రోత్సహించకూడదని స్పష్టంగా చెప్పారు. గాంధీ విశ్వ మానవుడని, ఆయన చెప్పిన ప్రతి మాట మనం అమలుపరుచుకోగల్గితే, భారత దేశం ప్రపంచంలో అగ్ర స్థానంలో నిలుస్తుంది. విశ్వ శాంతికై పాటుబడిన మహనీయుడు మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ఈ రోజు ఆయనకు నివాళులు అర్పించడం తన పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానని” బ్రహ్మశ్రీ డాక్టర్. సామవేదం షణ్ముఖ శర్మ గారు పేర్కొన్నారు.
ఎన్నో తీరిక లేని కార్యక్రమాలతో బిజీగా ఉండి కూడా మహాత్మా గాంధీ కి నివాళులు అర్పించడానికి విచ్చేసిన డాక్టర్. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ అయన ఇచ్చిన సందేశం అమూల్యమైనదని, అలాగే ప్రవాస భారతీయులుగా మేము చేస్తున్న సామజికసేవను అయన ప్రశంసించడం మాకు నూతనోత్తేజాన్ని కలిగిస్తుందని మహాత్మా గాంధీ మెమోరియల్ అఫ్ నార్త్ టెక్సాస్ కార్యదర్శి రావు కల్వల తనవందన సమర్పణ లో తెలిపారు. ఈ కార్యక్రమం లో రవి పట్టిసం, లక్ష్మి గుంటూరి, శర్మ గుంటూరి, సాంబు మంథా, డాక్టర్. నరసింహా రావు వేముల,ఎంవిఎల్ ప్రసాద్, కర్రా వెంకట్రావు, వెంకట్ ములుకుట్ల తదితరులు పాల్గొని జాతిపితకు నివాళులు అర్పించారు.













