పది నిమిషాలపాటు మిలియనీర్ గా మారిన లెలెన్ ఫ్లెమింగ్!
అమెరికాలోని బోస్టన్‌కు చెందిన 26 ఏళ్ల యువతి పది నిమిషాలపాటు మిలియనీర్‌గా మారిపోయింది. మిలియన్‌కు పైగా డాలర్లు పొరపాటున ఆమె బ్యాంకు ఖాతాలోకి ట్రాన్స్ఫర్ అయ్యాయి. 50 డాలర్లు ఉండాల్సిన తన ఖాతాలోకి ఒక్కసారిగా మిలియన్ డాలర్లు వచ్చి చేరడంతో అవాక్కైన ఆమె వెంటనే ఆ విషయాన్ని బ్యాంకు అధికారులకు తెలియజేసింది. దీంతో వారు డబ్బులు వెనక్కి తీసుకుని అసలు ఖాతాదారుకు పంపారు. ఇది జరగడానికి పది నిమిషాలు పట్టింది. ఫలితంగా ఆమె 10 నిమిషాలపాటు మిలియనీర్ అయింది. నిజానికి ఆ సొమ్ము ఫ్లోరిడాకు చెందిన మరో మహిళకు ట్రాన్స్ఫర్ కావాల్సి ఉంది. ఇద్దరి పేర్లు ఒకటే కావడంతో పొరపాటు జరిగినట్టు అధికారులు తెలిపారు.
తన బ్యాంకు ఖాతాకు సంబంధించిన యాప్ ఓపెన్ చేయగానే అందులో 1.4 మిలియన్ డాలర్లు కనిపించిందని, దీంతో ఆశ్చర్యపోయానని లెలెన్ ప్లెమింగ్ పేర్కొంది. నిజానికి అందులో ఉండాల్సింది 50 డాలర్లేనని తెలిపింది. వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసి, తాను తీసుకున్న విద్యారుణాలను తీర్చేయాలని భావించినట్టు చెప్పుకొచ్చింది. అయితే, మళ్లీ మనసు మార్చుకుని బ్యాంకు ఫోన్ చేసి విషయం చెప్పినట్టు వివరించింది. ఆమె ఫోన్‌తో నాలుక్కరుచుకున్న అధికారులు పొరపాటును గుర్తించి డబ్బులు వెనక్కి తీసుకుని అసలు ఖాతాదారుకు పంపారు. ఈ విషయం గురించి ఫ్లెమింగ్ చెబుతూ తాను వన్ టైమ్ మిలియనీర్నంటూ నవ్వుతూ చెప్పింది.













