Singapore: సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల ఉత్సవం
సింగపూర్ (Singapore) తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా బోనాల (Bonalu) పండుగ వైభవంగా జరిగింది. ఆదివారం సాయంత్రం 6 నుంచి రాత్రి 10 వరకు శ్రీ అరసకేసరి శివన్ ఆలయంలో భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాన్ని జరిపారు. సుమారు 900 మంది ప్రత్యక్షంగా హాజరై, అంతర్జాలం ద్వారా మరో 7,000 మంది వీక్షించారు. తెలంగాణ జానపద గేయాలు, భక్తిగీతాలు, నృత్యప్రదర్శనలు ఉత్సవానికి విశేష ఆకర్షణగా నిలిచాయి.
బోయిన స్వరూప, పెద్ది కవిత, సరితా తులా, దీపారెడ్డి, మోతే సుమతి, గంగా స్రవంతి, సంగీత తదితర మహిళలు కుటుంబ సమేతంగా భక్తిశ్రద్ధలతో దుర్గాదేవికి బోనాలు సమర్పించారు. మొదటి నుంచి చివరి వరకు సాంప్రదాయభరితంగా, సాంస్కృతిక ఘనతతో కొనసాగిన ఈ కార్యక్రమాన్ని అందరూ ప్రశంసించారు. తెలుగు కుటుంబాలు, కార్మిక సోదరులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
మహిళలు, చిన్నారులు బోనాల గీతలకు కేరింతలతో,ఉత్సాహంతో నృత్యాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. బోనాలు కాళికాదేవికి సమర్పించే పుణ్యనైవేద్యంగా… మట్టి కుండల్లో అన్నం, పాలు, పెరుగు, బెల్లంతో చేసిన బోనాలను తలపై మోస్తూ, డప్పులు, పోతురాజులు, ఆటగాళ్లతో ఆలయం వరకు వెళ్లారు. వేపచెట్టు రెమ్మలు, పసుపు, కుంకుమతో అలంకరించి, దీపం వెలిగించి ఆ బోనాలను సమర్పించారు. ఆ తర్వాత అమ్మవారి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.
పెద్దపులి ఆట, పోతురాజు వేషధారణ, సాంస్కృతిక నృత్యాలు కార్యక్రమానికి మరింత ఆకర్షణ జోడించాయి. ‘‘ఇలాంటి పండగ వేళ పిల్లలకు మన సాంప్రదాయాన్ని ప్రత్యక్షంగా చూపించడం సంతోషంగా ఉంది’’ అని హాజరైన మహిళలు తెలిపారు.
ఈ సందర్భంగా నిర్వాహకుడు బోయిన సమ్మయ్య మాట్లాడుతూ, సింగపూర్‌లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని తెలిపారు.
సమాజం అధ్యక్షుడు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ, బోనాలు తెలంగాణకు ప్రత్యేకమైన సాంప్రదాయక పండుగ అని, తక్కువ సమయంలో పెద్ద ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను అభినందిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది సమాజం సువర్ణోత్సవాలను కూడా ప్రకటించారు.
ఉపాధ్యక్షులు పుల్లన్నగారి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, కార్మిక సోదరులు పెద్దఎత్తున హాజరయినందుకు సంతోషం వ్యక్తం చేశారు.
ఉపాధ్యక్షులు కురిచేటి జ్యోతీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ‘‘స్పాన్సర్‌గా సహకరించిన వజ్ర రియల్‌ఎస్టేట్ వారికి అభినందనలు తెలిపి, వారి వ్యాపార అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాం’’ అన్నారు.
గౌరవ కార్యదర్శి పోలిశెట్టి అనిల్ కుమార్ మాట్లాడుతూ, కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సింగపూర్ తెలుగు సమాజం, అరసకేసరి దేవస్థానం సభ్యులకు , ఆహుతులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ‘‘హాజరైన ప్రతి ఒక్కరికీ చిరస్మరణీయ అనుభూతి అందించడంలో సభ్యుల కృషి అమోఘం’’ అని కొనియాడారు. కోశాధికారి ప్రసాద్, ఉపకోశాధికారి ప్రదీప్, ఉపాధ్యక్షులు నాగేష్, మల్లిక్, కార్యదర్శి స్వాతి, కమిటీ సభ్యులు గోపి కిషోర్, జనార్ధన్, జితేందర్, భైరి రవి, గౌరవ ఆడిటర్లు ప్రీతి, నవత తదితరులు పర్యవేక్షణకు తోడ్పడ్డారు.
‘‘తెలుగు వారంతా బోనాల స్ఫూర్తితో పాల్గొని మన ఐక్యతను చాటారు’’ అని నిర్వాహకులు పేర్కొన్నారు.







