తెలంగాణ అసోసియేషన్ అఫ్ న్యూజీలాండ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
ఆక్లాండ్ లోని ఎప్సం బ్లడ్ బ్యాంకు సెంటర్ లో ఈ రోజు రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి అధిక సంఖ్యలో ఆక్లాండ్ లోని తెలంగాణ బిడ్డలు హాజరయ్యారు. రక్త దానం ప్రాణదానం అని ప్రతి సంవత్సరం అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు సార్లు రక్త దాన శిబిరాలు నిర్వహిస్తామని అధ్యక్షుడు కళ్యాణ్ రావు కాసుగంటి తెలిపారు. ఈ కార్యక్రమంలో దాదాపు ౩౦ మంది రక్త దానం చేయడం వలన 90 మందికి అత్యవసరమైన యూనిట్ల రక్తాన్ని ఇచ్చి ప్రాణదానం చేసినదానికి సమానం అని తెలంగాణ అసోసియేషన్ అఫ్ న్యూ జీలాండ్ ముఖ్య సలహాదారు నరేందర్ రెడ్డి పట్లోళ్ల తెలిపారు.
రామ్మోహన్ దంతాల, రామరావు రాచకొండ, కిరణ్ కుమార్, రంగు మురళీధర్, రాజు, సౌమ్య, విజేతరావు తదితరులు పాల్గొన్నారు.
అనంతరం కళ్యాణ్ రావు కాసుగంటి మాట్లాడుతూ, ఈ సంవత్సరం అసోసియేషన్ బతుకమ్మ సంబరాలకు సంబంధించిన షెడ్యూల్ ను త్వరలో విడుదల చేస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 9 నుండి అక్టోబర్ 17 వరకు బతుకమ్మ నిర్వహిస్తున్నట్లుగానే తాము కూడా ఈ సంవత్సరం అన్ని రోజులు వివిధ ప్రాంతాల్లో బతుకమ్మ జరుపుకుంటామని, ఈ వేడుకలకు తెలంగాణ ఆడ బిడ్డలందరు భారీగా తరలివచ్చి బతుకమ్మ ఆడి తెలంగాణా స్ఫూర్తి ని న్యూ జీలాండ్ వాసులకు తెలియచేయాలని కోరారు.
ఆలాగే పెద్ద బతుకమ్మ సందర్భంగా ఈ సారి పెద్ద ఎత్తున తెలంగాణ నుండి వచ్చి కళాకారులు న్యూజీలాండ్‌లో ఆట పాటలతో అలరించడానికి కుతూహలంతో వున్నారని తెలిపారు. ఈ సారి బతుకమ్మ వేడుకలను ఆక్లాండ్ మహానగరం తో పాటు ఇతర ముఖ్య నగరాల్లో జరపబోతున్నామని తెలిపారు.













