H1B Visa: భారతీయులకు గుడ్‌న్యూస్.. హెచ్1బీ రూల్స్ మార్చేసిన యూఎస్ ప్రెసిడెంట్ బైడెన్..!
అమెరికా అధ్యక్షుడిగా తన పదవీకాలం ముగియడానికి ముందు ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ శుభవార్త చెప్పారు. భారతీయులు చాలా ఎక్కువగా తీసుకునే హెచ్1బీ వీసా నియమాలను కొంత సరళీకరించాలని ఆయన నిర్ణయించారు. తద్వారా అమెరికాలోని పలు కంపెనీలు.. విదేశాల్లోని నాణ్యమైన నిపుణులకు ఉద్యోగాలు ఇవ్వడం సులభతరం కానుంది. అలాగే అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు కూడా తమ ఎఫ్1 వీసాలను హెచ్1బీకి (H1B Visa) మార్చుకునే ప్రక్రియ సులువు అవుతుంది.
అమెరికాలో ఉద్యోగాలు చెయ్యాలనుకునే విదేశీయులు చాలా ఎక్కువగా హెచ్1బీ వీసాపైనే ఆధారపడతారు. పలు బడా కంపెనీలు ఈ వీసాలతోనే విదేశీ నిపుణులను తమ కంపెనీల్లో హైర్ చేసుకుంటూ ఉంటాయి. అయితే గతంలో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వీసా ప్రక్రియను కొంత కఠినం చేశారు. ఈ నిబంధనల వల్ల అధికంగా నష్టపోయింది భారతీయులనే చెప్పాలి. ఎందుకంటే ప్రపంచంలో ఈ వీసాను (H1B Visa) వినియోగించుకొని అమెరికాలో బాగా ఉద్యోగాలు సంపాదిస్తున్న వారిలో భారతీయులు చాలా ముందున్నారు. ఈ నిబంధనలు కఠినంగా మారడంతో చాలా మంది భారతీయులు యూఎస్ వెళ్లలేకపోయారనడంలో అతిశయోక్తి లేదు.
ఇప్పుడు బైడెన్ ప్రభుత్వం ఈ నిబంధనలను సరళీకరిస్తూ నిర్ణయం తీసుకుంది. హెచ్1బీ స్టాచ్యుయరీ లిమిట్ పరిధిలోకి రాని ప్రత్యేక హోదాలు, నాన్‌ప్రాఫిట్ మరియు ప్రభుత్వ రీసెర్చ్ ఆర్గనైజేషన్ల డెఫినిషన్ను మార్చడం ద్వారా.. అటు ఉద్యోగులు అమెరికా రావడంలో, ఇటు కంపెనీలు విదేశీయులను హైర్ చేసుకోవడంలో మరింత ఫ్లెక్సిబిలిటీ ఉండేలా కొత్త రూల్స్ తీసుకొచ్చినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) తెలిపింది. దీని వల్ల అమెరికా కంపెనీలు తమ అవసరాల మేరకు నిపుణులకు ఉద్యోగాలు కల్పించి, గ్లోబల్ మార్కెట్లో మరింత బలంగా మారుతాయని డీహెచ్ఎస్ అభిప్రాయపడింది. ఈ కొత్త సరళీకరణ వల్ల హెచ్1బీ (H1B Visa) వీసాదారులకు యూఎస్ సిటిజన్‌షిప్ రావడం కూడా వేగవంతం అవనుంది.







