Grada: గ్రేటర్ రాయలసీమ ప్రగతిపై డల్లాస్లో సమావేశం హాజరైన భూమన, కుసుమకుమారి
గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డాలస్ ఏరియా (Grada) ఆధ్వర్యంలో ఫ్రిస్కోలో రాయలసీమ (Rayalaseema) ప్రగతిపై ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాయలసీమ ప్రాంతం నుండి ప్రత్యేకంగా ప్రముఖ రచయిత భూమన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన తన ప్రసంగంలో రాయలసీమ ప్రస్తుత పరిస్థితి, ముఖ్యంగా దీర్ఘకాలంగా వేధిస్తున్న నీటి సమస్యలు, వెనుకబాటుతనం గురించి ఎంతో ఆవేదనతో, స్పష్టంగా వివరించారు. మన ప్రాంత సహజ సంపద అయిన శేషాచలం అడవుల గురించి, ముఖ్యంగా ఎర్రచందనం చెట్ల గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఈ విలువైన సంపదను అక్రమ మార్గాల్లో ఇతర దేశాలకు తరలించి లాభం పొందకుండా, స్థానికంగానే వాటి ఆధారిత పరిశ్రమలను స్థాపించి, ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా మన ప్రాంతాన్ని ఎలా ఆర్ధికంగా బలోపేతం చేయవచ్చో ఆయన చక్కగా వివరించారు. సహజ వనరులను సక్రమంగా వినియోగించుకుంటే రాయలసీమ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందనే ఆశాభావాన్ని ఆయన కలిగించారు.
ఈ సమావేశానికి మరో గౌరవ అతిథిగా శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం మాజీ వైస్-ఛాన్సలర్, ప్రఖ్యాత విద్యావేత్త ప్రొఫెసర్ పి. కుసుమ కుమారి హాజరయ్యారు. తెలుగు సాహిత్యంలో ఆమెకు ఉన్న అపారమైన జ్ఞానం, అనుభవం గురించి వివరించారు. ఆమె తన ప్రసంగంలో తెలుగు భాష మాధుర్యం, సాహిత్యం యొక్క గొప్పదనం, దానిని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత గురించి ఎంతో అద్భుతంగా వివరించారు. ఆమె మాటలు తెలుగు భాషపై మనకున్న మమకారాన్ని, గౌరవాన్ని మరింత పెంచాయి.
ఈ సందర్భంగా, సంస్థ అభివృద్ధికి విశేష కృషి చేసిన వారిని గౌరవించారు. గ్రెడా వ్యవస్థాపకులు డాక్టర్ దర్గా నాగి రెడ్డి, చెన్న కోర్వి, ప్రస్తుత అధ్యక్షులు గాలి శ్రీనివాస్ రెడ్డిలను ప్రత్యేకంగా సత్కరించారు. అలాగే, సంస్థ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తున్న వారిని కూడా సత్కరించి వారి సేవలను అభినందించడం జరిగింది. సన్మాన కార్యక్రమం సంస్థ సభ్యులలో నూతనోత్సాహాన్ని నింపింది. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో సభ్యులు, శ్రేయోభిలాషులు హాజరై విజయవంతం చేసారు. వారి ఉత్సాహం, భాగస్వామ్యం కార్యక్రమానికి వన్నె తెచ్చాయి.
హాజరైన వారిలో ముఖ్యులు కొందరు: నంద కోర్వి, అనిత నాగిరెడ్డి, సతీష్ సీరం, బ్రహ్మ చిరా, హరినాథ్ పొగకు, హేమంత్ కాకుట్ల, జగదీశ్వర నందిమండలం, జగదీష్ తుపాకుల, పవన్ పల్లంరెడ్డి, ప్రసాద్ నాగారపు, రాజు కంచం, శివ అద్దేపల్లి, శివ వల్లూరు, శ్రీధర్ బొమ్ము, శ్రీకాంత్ దొంత, సురేష్ మోపూరు, ఉమా గొర్రెపాటి, మరియు కార్తీక్ మేడపాటి. వీరితో పాటు ఇంకా అనేక మంది సభ్యులు, రాయలసీమ అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేసారు.








