ATA: ఆటా వేడుకలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆహ్వానం
హైదరాబాద్: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) ప్రతినిధుల బృందం శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసింది. ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా, ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీష్ రామసహాయం రెడ్డిల నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో అసోసియేషన్ చేపడుతున్న పలు సేవా కార్యక్రమాలను ఆయనకు వివరించారు.
ఆటా వేడుకలకు ఆహ్వానం
ఈ నెల 27న హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించనున్న ‘ఆటా వేడుకలు–2025’ గ్రాండ్ ఫినాలే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయాలని ప్రతినిధులు ఉప ముఖ్యమంత్రిని కోరారు. అలాగే, 2026 జూలైలో అమెరికాలోని బాల్టిమోర్ నగరంలో నిర్వహించ తలపెట్టిన ’19వ ఆటా మహాసభల’కు కూడా రావాల్సిందిగా ఆయనను సాదరంగా ఆహ్వానించారు.
సాంస్కృతిక వారధిగా ‘ఆటా’
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఏకం చేయడమే లక్ష్యంగా ఆటా నిర్వహిస్తున్న విద్యా, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలను ఈ సందర్భంగా భట్టి విక్రమార్కకు వివరించారు. ముఖ్యంగా విదేశాల్లో పెరుగుతున్న తెలుగు యువతకు మన భాష, సంస్కృతీ సంప్రదాయాల పట్ల అవగాహన కల్పించేందుకు చేస్తున్న కృషిని ప్రతినిధులు ప్రస్తావించారు.
ప్రభుత్వ సహకారం ఉంటుందని భరోసా
ఆటా ప్రతినిధుల కృషిని ఉప ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అభినందించారు. తెలుగు భాషా పరిరక్షణకు, సంస్కృతి వికాసానికి ఇలాంటి సంస్థలు చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆటా చేపట్టే మంచి కార్యక్రమాలకు ఎల్లప్పుడూ సహకారం ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీ కో-చైర్ నరసింహ ద్యాసాని, సాయి సుధిని, ట్రెజరర్ శ్రీకాంత్ గుడిపాటి పాల్గొన్నారు. వీరితో పాటు శ్రీధర్ బాణాల, కాశీ కొత్త, రామకృష్ణ అలా, సుధీర్ దామిడి, శ్రీధర్ తిరిపతి, పరమేష్ భీంరెడ్డి, రాజు కక్కెర్ల, రఘువీర్ మర్రిపెద్ది, వినోద్ కోడూరు, కిషోర్ గూడూరు, నర్సిరెడ్డి గడ్డికోపుల, విష్ణు మాధవరం, హరీష్ బత్తిని, సుమ ముప్పాల, వేణు నక్షత్రం, లక్ష్ చేపూరి, అనంత్ పజ్జూర్, అరవింద్ ముప్పిడి, తిరుమల్ మునుకుంట్ల, మీడియా సలహాదారు ఈశ్వర్ బండా తదితరులు పాల్గొన్నారు.






