అమెరికాకు చైనా హెచ్చరిక
అమెరికాలో పనిచేస్తున్న చైనా జర్నలిస్టులకు వీసాలను పునరుద్ధరించకపోతే తగిన చర్యలను తమ దేశం కూడా తీసుకోగలదని చైనా హెచ్చరించింది. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ మీడియాతో మాట్లాడుతూ చైనా జర్నలిస్టులకు వీసాలను రెన్యువల్ చేయాలని ఇప్పటికే పలుమార్లు కోరామనీ, అమెరికా సానుకూలంగా స్పందించకపోతే అటువంటి చర్యలనే తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. హాంకాంగ్ లో పని చేస్తున్న అమెరికన్ జర్నలిస్టుల వీసాలను పునరుద్ధరించబోమని ఆయన పరోక్షంగా వెల్లడించారు. చైనా జర్నలిస్టుల వీసాల కాలపరిమితి ఈ నెల ఆరవ తేదీతో పూర్తి అయినప్పటికీ, అమెరికా పునరుద్ధరించలేదని గ్లోబల్ టైమ్స్ ఎడిటర్ ఇన్ చీఫ్ హ్యూ గ్జిగ్జిన్ తెలిపారు.
అమెరికా తన వైఖరిని మార్చుకోకపోతే చైనా ప్రతీకారం తీర్చుకుంటుందని హెచ్చరించారు. అమెరికాలో విదేశీ జర్నలిస్టులకు తగిన భద్రత లేదని ఆయన ఆరోపించారు. అమెరికాలో చైనా జర్నలిస్టులకు వేధింపులకు గురి అవుతున్నారని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ అన్నారు.













