ప్రతిభ ఉంటేనే అమెరికాలో ఉద్యోగం…జే తాళ్ళూరి
అమెరికాలో మారిన పరిస్థితుల నేపథ్యంలో సాంకేతిక, ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థులకు ప్రతిభ, నైపుణ్యాలు ఉంటేనే మంచి అవకాశాలు లభిస్తాయని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఎలక్టెడ్ ప్రెసిడెంట్ జే తాళ్ళూరి, ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్త బత్తినేని రాకేష్ అన్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయ్యాక ఆ దేశంలోనూ సాప్ట్వేర్ ఉద్యోగాలకు పోటీ అధికమైందని, ముందునుంచే విద్యార్థులు మంచి యూనివర్సిటీలను ఎంచుకుని వాటిలో మాస్టర్స్ చేయాలన్నారు. ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఆధ్వర్యంలో కవితా విద్యాసంస్థలు, బత్తినేని చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో విదేశీ విద్యపై నిర్వహించిన అవగాహన సదస్సుకు వారు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.
అమెరికా వెళ్లాలంటే నైపుణ్యం కలిగిన విద్యను అభ్యసించాలని, మార్కుల ట్రెండ్ కాకుండా ఫండమెంటల్ కాన్సెప్ట్‌పై అవగాహన పెంచుకోవాలని జే తాళ్ళూరి సూచించారు. అమెరికాలోనూ 140 వర్సిటీలను అనర్హమైనవిగా అక్కడి ప్రభుత్వం గుర్తించి మూసివేసిందని, దీంతో వాటిలో చదువుతున్న 40 వేల మంది విద్యార్థులు వీధులపాలయ్యారని ఆయన తెలిపారు. ఇక్కడ ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని.. రెండు, మూడేళ్లపాటు అనుభవం వచ్చిన తర్వాత అమెరికాలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొని, ఎంఎస్ చేస్తే ఆ విద్యార్థులు మరింతగా రాణించే అవకాశం ఉంటుందన్నారు.
తల్లిదండ్రులు అప్పులు చేసి తమ పిల్లలను అమెరికా పంపిస్తుంటే.. అక్కడ విద్యార్థులు ఒక పూట చదువుతూ, మరో పూట బంకుల్లో, సూపర్ మార్కెట్లలో పనిచేస్తున్నారని గుర్తుచేశారు.ఈ క్రమంలో తనిఖీల సమయంలో దొరికిపోయి.. భవిష్యత్తులో అమెరికా వెళ్లే అవకాశాన్నే కోల్పోవాల్సివస్తోందన్నారు.
గుర్తింపులేని యూనివర్సిటీల్లో చేరొద్దు..
అమెరికా వెళ్తున్న విద్యార్థులు పలువురు గుర్తింపులేని యూనివర్సిటీల్లో చేరి మోసపోతున్నారని బత్తినేని రాకేష్ అన్నారు. కన్సల్టెన్సీలు తమ కమీషన్ల కోసం ఏదో ఒక యూనివర్సిటీకి పంపించి చేతులు దులిపేసుకుంటున్నాయని, వాటిలో చదివిన విద్యార్థులు ఉద్యోగావకాశాలు లేక అవస్థలు పడాల్సివస్తోందని పేర్కొన్నారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక భారత యువతకు ఉద్యోగావకాశాలను కష్టతరం చేశారని తెలిపారు.
ఈ సదస్సులో శ్రీ కవితా విద్యాసంస్థల చైర్మన్ పారుపల్లి ఉషాకిరణ్, కన్సల్టెంట్ సరితారెడ్డి, శ్రీ కవిత విద్యాసంస్థల అధినేత పారుపల్లి విజయలక్ష్మి, విజయ కళాశాల కరస్పాండెంట్ బుచ్చిరామయ్య తదితరులు పాల్గొన్నారు.













