TANA: ఆస్టిన్ లో ఘనంగా థీమ్ తానా పోటీలు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ఆధ్వర్యంలో జరగనున్న 24వ తానా మహాసభలలో భాగంగా నిర్వహించిన థీమ్ తానా (Dhimtana) 2025 సాంస్కృతిక పోటీలు ఆస్టిన్ నగరంలో తానా ప్రాంతీయ ప్రతినిది సుమంత్ పుసులూరి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సెంట్రల్ టెక్సాస్ ప్రాంతం నుండి 400 మందికి పైగా పాల్గొనడంతో ఈవెంట్ విజయవంతమైంది. క్లాసికల్, ఫోక్, మరియు ఫిల్మీ నృత్య పోటీలలో వివిధ వయస్సుల గ్రూపుల నుండి వచ్చిన బృందాలు పాల్గొని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
పాటల పోటీలు-క్లాసికల్ మరియు ఫిల్మీ/ఫోక్ శైలుల్లో చిన్న పిల్లల నుండి పెద్దల వరకూ అందరూ తమ ప్రతిభను ప్రదర్శించారు. బ్యూటీ పేజెంట్ ఆడిషన్స్ మిస్ తీన్ తానా, మిస్ తానా, మిసెస్ తానా టైటిళ్ల కోసం నిర్వహించిన ఎంపిక కార్యక్రమాల్లో కూడా పలువురు పాల్గొన్నారు. ఆస్టిన్ ప్రిలిమినరీల్లో విజేతలుగా నిలిచిన వారు జూలై 3-5, 2025 న మధ్య మిచిగన్ రాష్ట్రంలోని నోవీ నగరంలో జరిగే తానా మహాసభల జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంటారు. ఈ విజయవంతమైన కార్యక్రమానికి తమ మద్దతు మరియు సహకారం అందించిన ఆస్టిన్ తానా టీం, స్వచ్ఛంద సేవకులు, న్యాయనిర్ణేతలు, స్పాన్సర్లు, మరియు ప్రేక్షకులకు సుమంత్ పుసులూరి ధన్యవాదాలు తెలియజేశారు.







