నేటి నుంచి ఆటా మహాసభలు
అమెరికా వేదికగా తెలంగాణ సంస్కృతి, సంబురాలను ప్రపంచానికి చాటిచెప్పేలా అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో ప్రపంచ తెలంగాణ మహాసభలు-2018 నేటి నుంచి మొదలుకానున్నాయి. జూన్ 29, 30, జులై 1వ తేదీల్లో టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ నగరం వేదికగా ఈ మహాసభలను నిర్వహించనున్నట్టు చైర్మన్ కరుణాకర్‌రావు మాధవరం, అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి కందిమల్ల, కన్వీనర్ బంగారెడ్డి వెల్లడించారు. టీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత జితేందర్‌రెడ్డి, ఎంపీ సీతారాంనాయక్, తెలంగాణ ఐటీ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు సందీప్‌కుమార్ ముక్తాల ఈ మహాసభలకు హాజరవుతున్నారు.
ఈ సందర్భంగా జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఇండస్ట్రియల్ పాలసీ, ఐటీ పాలసీ సహా ప్రాజెక్టుల గురించి వివరించనున్నట్లు తెలిపారు. 18 దేశాల ప్రతినిధులు హాజరుకానున్నారు. శనివారం ప్రధాన కార్యక్రమం ప్రారంభం కానుంది. సాయంత్రం ఆటా తెలంగాణ పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఇదేరోజు భద్రాద్రి సీతారామ కల్యాణం తెలంగాణ దేవాదాయ ధర్మాదాయశాఖతో కలిసి నిర్వహించనున్నారు. ఆటపాటలతో పాటు ఇమిగ్రేషన్ ఫోరం ద్వారా చర్చగోష్టులు నిర్వహించనున్నారు.













