ATA: డిసెంబర్ 12 నుంచి 27 వరకు ఆటా కార్యక్రమాలు
అమెరికా తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో డిసెంబర్ 12 నుంచి 27 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జరుగనున్న ATA సేవ కార్యక్రమాలు తెలుగు సంస్కృతి, విద్య, సేవా కార్యక్రమాలతో అట్టహాసంగా ప్రారంభంకానున్నాయి. మన సంస్కృతి పట్ల ప్రేమ, మన ప్రజల పట్ల ఆప్యాయత అనే భావంతో ప్రతి సంవత్సరం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ATA ఈసారి మరింత విస్తృతంగా ప్రజల మధ్యకు రానుంది. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ సహా రంగా రెడ్డి, సంగారెడ్డి, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, సిద్ధిపేట, సిరిసిల్ల తదితర జిల్లాల్లో ATA బృందం పలు రంగాల్లో సేవా కార్యక్రమాలను చేపడుతోంది.
డిసెంబర్ 12వ తేదీ ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లో జరగనున్న ప్రెస్‌మీట్‌తో ప్రారంభమయ్యే ఈ వేడుకల్లో అదే రోజు రంగారెడ్డి జిల్లా, జిల్లెల గూడ లో విద్యా స్కాలర్షిప్లు, సేవ కార్యక్రమాలు, సాయంత్రం ATA నిర్వహించే సాంస్కృతిక వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. డిసెంబర్ 13న సంగారెడ్డి జిల్లా కంది గ్రామంలో ఐఐటీ కాలేజ్ లో సెమినార్, స్టార్టప్ పిచ్ పోటీలు నిర్వహించనున్నారు. 14న SPR యూనివర్సిటీలో సాహిత్య కార్యక్రమం, 15న ATA బృందం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దర్శనం, అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16, 17 తేదీలలో విజయవాడ, విశాఖలో బిజినెస్ సెమినార్లు, విద్యా పరమైన చర్చలు జరగనున్నాయి.
డిసెంబర్ 19, 20 తేదీల్లో హైదరాబాద్‌లోనే యువజన కార్యక్రమాలు, స్పోర్ట్స్ ఈవెంట్లు, రంగా రెడ్డి జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. 21న మహబూబాబాద్ జిల్లా తిమ్మాపూర్ గ్రామంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్, 22న చిన్నారుల కోసం విద్య,ఆధ్యాత్మిక, వైద్య పరమైన కార్యక్రమం, మహబూబ్ నగర్ జిల్లా మడ్డిగట్ల గ్రామంలో నిర్వహించనున్నారు. 23న నాగర్‌కర్నూల్ జిల్లాలో మెడిపూర్ గ్రామంలో మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక సెమినార్, హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయనున్నారు. 24న సూర్యాపేట జిల్లా అనంతారం గ్రామంలో వైద్య ఆరోగ్య శిబిరం, ఆలయ ప్రారంభోత్సవం జరుగుతుంది.
డిసెంబర్ 25న సిద్ధిపేటలో చిన్నారుల కోసం ‘నిషాంత్ బాలసదన్’ చారిటీ కార్యక్రమం, తరువాత సిరిసిల్ల జిల్లా గంభీరరావుపేటలో ZPHS విద్యార్థుల కోసం పాఠశాల అభివృద్ధి పరమైన సేవ కార్యక్రమం నిర్వహించనున్నారు. చివరిగా డిసెంబర్ 27న హైదరాబాద్ రవీంద్రభారతిలో ATA గ్రాండ్ ఫినాలే జరగనుంది. సాంస్కృతిక కార్యక్రమాలు, అవార్డుల ప్రదానంతో వేడుకలకు అద్భుత ముగింపు ఇవ్వనున్నారు.
ప్రజలకు చేరువగా, సేవను లక్ష్యంగా, సంస్కృతిని కేంద్రంగా ఉంచుకుని జరగనున్న ATA వేడుకలు ఈసారి మరింత విస్తృతంగా, మరింత అర్థవంతంగా ఉండనున్నాయని ఆటా అధ్యక్షులు జయంత్ చల్లా, ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీష్ రెడ్డి రామసహాయం తెలిపారు.













