ATA: మంత్రి శ్రీధర్‌బాబు, ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణతో ఆటా ప్రతినిధుల భేటీ.. కీలక అంశాలపై చర్చ
హైదరాబాద్: అమెరికా తెలుగు అసోసియేషన్ (ATA – ఆటా) అధ్యక్షుడు జయంత్ చల్లా, ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీష్ రెడ్డి.. డిసెంబర్ 11న ప్రముఖులను కలిశారు. ఆటా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలతో పాటు, అమెరికాలో తెలుగువారి ఎదుర్కొంటున్న సమస్యలు, రాబోయే ఆటా మహాసభలపై ఈ భేటీలో చర్చించారు.
మంత్రితో..
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 19వ మహాసభలు యువజన సదస్సు అమెరికాలోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో జులై 31 నుంచి ఆగస్టు 2 వరకు జరగనున్నాయి. ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబును ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీష్ రెడ్డి, మీడియా కోఆర్డినేటర్ ఈశ్వర్ బండా మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆటా చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా, డిసెంబర్ 19న హైదరాబాద్ టీ-హబ్‌లో నిర్వహించనున్న బిజినెస్ సెమినార్‌కు కూడా ముఖ్య అతిథిగా హాజరు కావాలని మంత్రి శ్రీధర్ బాబును కోరారు. ఈ సమావేశంలో అమెరికా-తెలంగాణ మధ్య వ్యాపార, సాంకేతిక, స్టార్టప్ రంగాల అనుబంధాన్ని బలోపేతం చేయడానికి ఆటా చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. ఆటా మహాసభల్లో అమెరికాలోని ప్రవాస తెలుగు సమాజం, వ్యాపారవేత్తలు, యువ ఇన్నోవేటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారని తెలిపారు. కార్యక్రమాల్లో సాంస్కృతిక వేడుకలు, యూత్ కాన్ఫరెన్స్‌లు, బిజినెస్ కాన్ఫరెన్సులు, ఎన్ఆర్ఐ సదస్సులు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు మంత్రికి వివరించారు.
‘ఆంధ్రజ్యోతి’ ఎండీతో…
అనంతరం ఆటా నేతలు ‘ఆంధ్రజ్యోతి’ మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణను కలిసి తమ సేవా కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. ప్రభుత్వ నిర్ణయాలు: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, వాటి ప్రభావం తెలుగువారిపై ఏ విధంగా ఉంటుందనే విషయంపై చర్చించారు. వీసా సమస్యలు: తెలుగువారు ఎదుర్కొంటున్న హెచ్-1బీ వీసాల గురించి కూడా ఈ సందర్భంగా చర్చించినట్లు తెలిసింది. ఆటా తెలుగు రాష్ట్రాలలో 16 రోజుల పాటు పలు సేవా, విద్యా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ప్రముఖుల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.













