ATA: ఆంధ్రప్రదేశ్లో రేపటి నుండి ఆటా కార్యక్రమాలు
- సీఎం, మంత్రులతో భేటీ కానున్న ఆటా ప్రతినిధులు
అమరావతి: అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో రేపటి నుండి పలు కార్యక్రమాలు, వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా, ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీష్ రామసహాయం రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఆటా ప్రతినిధి బృందం సీఎం చంద్రబాబుతో పాటు రాష్ట్రంలోని పలువురు కీలక మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసి ఆటా మహాసభలకు ఆహ్వానించనుంది. ఇదే సమయంలో ప్రవాస తెలుగు సమాజం, రాష్ట్రాభివృద్ధి, పెట్టుబడులు, వ్యాపార అవకాశాలు వంటి అంశాలపై ఈ భేటీల్లో చర్చిస్తామని వారు తెలిపారు.
రేపు విశాఖపట్నంలోని ప్రతిష్ఠాత్మక గీతం యూనివర్సిటీలో ఆటా ఆధ్వర్యంలో బిజినెస్ సెమినార్ నిర్వహించనున్నారు. అమెరికాలో స్థిరపడిన తెలుగు పారిశ్రామికవేత్తలు, ఐటీ నిపుణులు ఈ సెమినార్లో పాల్గొని తమ అనుభవాలను పంచుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల అభివృద్ధి, స్టార్టప్ సంస్కృతి, గ్లోబల్ మార్కెట్లతో అనుసంధానం వంటి అంశాలపై లోతైన చర్చ జరగనుంది. ఆంధ్రప్రదేశ్–ప్రవాస తెలుగు సమాజం మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆటా చేపట్టిన ఈ కార్యక్రమాలు రాష్ట్రాభివృద్ధికి దోహదపడతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ బిజినెస్ సెమినార్ను అడగగానే వెంటనే ఏర్పాటు చేయడంలో విశాఖపట్నం ఎంపీ భరత్ సంపూర్ణ సహకారం అందించారని ఆటా బృందం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.






