ATA: ఐఐటీ హైదరాబాద్‌తో ఆటా చారిత్రక ఒప్పందం

విద్యార్థులకు ప్రపంచ స్థాయి అనుభవాన్ని అందించేందుకు అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) చారిత్రక ఒప్పందం చేసుకుంది. భారతదేశంలోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (IITH)తో ఆటా (ATA) అవగాహన ఒప్పందం చేసుకుంది. ఇంజనీరింగ్‌లో దేశంలోనే 7వ ర్యాంక్, ఆవిష్కరణలలో 6వ ర్యాంక్ సాధించిన ఐఐటీ హైదరాబాద్‌తో సెప్టెంబర్ 25న వాషింగ్టన్ డీసీలో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
తెలుగు డయాస్పోరాకు చెందిన విద్యార్థులకు ఐఐటీ హైదరాబాద్ (IITH) క్యాంపస్‌లో ఇంటర్న్‌షిప్ అవకాశాలను కల్పించడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం. ఐఐటీహెచ్ (IITH) డైరెక్టర్ ప్రొ. బి.ఎస్. మూర్తి, ఆటా (ATA) అధ్యక్షుడు జయంత్ చల్లా ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా కొన్ని వారాల నుండి ఒక సంవత్సరం వరకు ఇంటర్న్‌షిప్‌లకు మార్గం సుగమం అవుతుంది. ఇది పరిశోధనా సహకారాన్ని, ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని ఇరువర్గాలు భావిస్తున్నాయి.
ఐఐటీహెచ్ (IITH) డైరెక్టర్ ప్రొ. బి.ఎస్. మూర్తి మాట్లాడుతూ.. విద్యా సంస్థతో కాకుండా ఒక సంస్థతో ఐఐటీహెచ్ ఇలాంటి ఒప్పందం కుదుర్చుకోవడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా విద్యార్థులకు అత్యాధునిక పరిశోధనలలో విలువైన అనుభవాన్ని అందుతుందని ఆటా (ATA) అధ్యక్షుడు జయంత్ చల్లా తెలిపారు. ఈ ఇంటర్న్‌షిప్ కార్యక్రమం కోసం అర్హులైన విద్యార్థులను గుర్తించడంలో ఆటా (ATA) సహకరిస్తుందని చెప్పారు.