అమెరికాలో అసోం యువతికి అరుదైన గౌరవం
అసోంకు చెందిన సల్మా హుస్సేన్ (22) అనే యువతి అరుదైన ఘనత సాధించింది. వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ శాంతిస్థాపన స్వచ్ఛంద సేవాసంస్థ అందించే సహాయానికి ఎంపికైంది. ప్రపంచవ్యాప్తంగా ఇలా ఎంపికైన ఎనిమిది మందిలో సల్మా ఒకరు. అంతేకాదు, మనదాశం నుంచి ఏంపికైన ఏకైక యువతి. అసోంలోని కామ్రూప్ (గ్రామీణ) జిల్లా సంటోలి గ్రామానికి చెందిన సల్మా ఇటీవల న్యాయశాస్త్రంలో డిగ్రీ చదివారు. అసోంలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని, దాన్ని శాంతివనం గా మార్చాలని ఆకాంక్షిస్తున్నారు. ఆమె ఆకాంక్షను నెరవేర్చడానికి అండీ లీడర్షిప్ ఇనిస్టిట్యూట్ ఫర్ యంగ్ విమెన్ అనే సంస్థ ముందుకొచ్చింది. ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడిన ఆండీ పరమొవచ్ అనే సామాజిక కార్యకర్త 2007లో ఇరాక్‌లో చనిపోయారు. ఆయన స్మృత్యర్థం ఏర్పడిన సంస్థ ప్రపంచవ్యాప్తంగా మహిళలకు ఆర్థికసాయం చేస్తోంది. ఆగస్టు 5 నుంచి 18 వరకు వాషింగ్టన్ డీసీలో సల్మాకు శిక్షణ కార్యక్రమం ఉంటుంది. ఆ సమయంలో అక్కడికి వచ్చే మానవహక్కుల కార్యకర్తలతో తన ఆకాంక్ష గురించి, చర్చించి కార్యరూపం దాల్చడానికి తగిన సూచనలు, సలహాలు పొందుతారు.













