మిడ్ అమెరికా ఎలక్షన్స్.. అరుణ మిల్లర్‌కు తెలుగు సంఘాల నాయకులు అభినందనలు
అమెరికా రాజకీయాల్లో మేరీ ల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా అరుణ మిల్లర్ ఎన్నికై చరిత్ర సృష్టించడం పట్ల అమెరికాలోని పలు తెలుగు సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఆమెకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశాయి. అమెరికాలోని తెలుగు సంఘాల నాయకులు అరుణ కాట్రగడ్డపై ప్రశంసలు కురిపించారు. మేరీ ల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా అరుణ మిల్లర్ గెలుపొందడం తెలుగు వారందరికీ గర్వకారణమని తానా సంఘం ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి లావు అన్నారు. మా అందరికీ ఆమె ఆత్మీయురాలని, ఆమె మరిన్ని విజయ శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.
అరుణ మిల్లర్ తెలుగువారికి ఎల్లప్పుడూ అండగా ఉండేవారని ఆటా ప్రెసిడెంట్ భువనేశ్వర్ బుజాల కొనియాడారు. ఆమె లెఫ్టినెంట్ గవర్నర్ వంటి ఉన్నత స్థాయి పదవి చేపట్టడం ఆనందదాయకమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఆటా సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు.
మేరీ ల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన అరుణ మిల్లర్ తెలుగు మహిళ కావడం ఆనందదాయకంగా ఉందని టీటీఏ సంఘం అధ్యక్షుడు మోహన్ పాటలోళ్ళ అన్నారు. భారత్‌లో ఎంతో మందికి ఆమె స్ఫూర్తిదాయకమని, మరెన్నో పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.
అరుణ మిల్లర్ ఎన్నిక పట్ల నాట్స్ ప్రెసిడెంట్ బాపయ్య చౌదరి నూతి శుభాకాంక్షలు తెలిపారు. భారత్ నుంచి వలస వచ్చి అమెరికా రాజకీయాల్లో ఉన్నత స్థాయికి వెళ్లడం అభినందనీయమన్నారు. అమెరికాలో జన్మించిన భారతీయులకు అరుణ స్పూర్తిదాయకమన్నారు.
వేటా వ్యవస్థాపక అధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి కూడా అరుణ ఎన్నిక పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఆమెకు అభినందనలు తెలియజేశారు.













