అంగన్వాడీల అభివృద్ధికి ఎన్నారైల చేయూత – జయరాం కోమటి
రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి ఎన్నారైలు, తానా ఫౌండేషన్ సహకరిస్తోందని అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న జయరామ్ కోమటి అన్నారు. విశాఖ జిల్లాలో ఎపి జన్మభూమి ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పరిశీలించారు.
విశాఖ జిల్లా పరవాడ మండలంలో పరవాడ, వెన్నలపాలెం గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాల ఆధునీకరణ కార్యక్రమాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రారంభించారు. ప్రవాసాంధ్రుల సాయంతో ఒక్కో అంగన్ వాడీ కేంద్రాన్ని 2 లక్షల రూపాయల ఖర్చుతో ఆదర్శనీయంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలలో స్మార్ట్ టీవీ, మంచినీటి శుద్ధి యంత్రం, పిల్లలకు యూనిఫారం, ఆట వస్తువులు, స్కూల్ బ్యాగ్ టేబ్లెట్ వంటి 23 రకాల వస్తువులను సమకూర్చుతున్నామని చెప్పారు.
ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ తరగతుల నిర్వహణలో విద్యా శాఖ ఉన్నతాధికార్లతో పాటు, జిల్లా, క్షేత్ర స్థాయి ప్రభుత్వ సిబ్బంది అందిస్తున్న సహకారం ప్రశంసనీయం అన్నారు. ఎన్నారై ప్రతినిధులు పైలా ప్రసాదరావు, జోగినాయుడు, సుభాష్ లను ఉత్తరాంధ్ర ప్రాంతం తరుపున ఏపీ జన్మభూమి కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో గుంటూరు జెడ్పీ మాజీ చైర్ పర్సన్ నాగభూషణం, ఏపీ జన్మభూమి సమన్వయకర్తలు పైలా ప్రసాదరావు, జోగినాయుడు, గారపాటి ప్రసాద్, పైలా జగన్నాధరావు, రామినేని ఫౌండేషన్ ప్రతినిధి ధర్మా, ఐసిడిఎస్ జిల్లా ప్రాజెక్టు అధికారిణి చిన్నయదేవి, తదితరులు పాల్గొన్నారు.













