విద్యను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి : ప్రతిపాటి
విద్యను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రూ.21 వేల కోట్లను కేటాయించిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. గుంటూరు జిల్లా, యడ్లపాడు మండలంలోని లింగారావుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డిజిటల్ క్లాస్‌రూంల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ చదువు నేర్పిన గురువును, పాఠశాలను మరవకుండా అభివృద్ధికి సహకరించడం అనేది ఎంత మందికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. గతంలో ఎంతో మంది పేదరికంలో ఉండి తమ పిల్లలను చదవించుకోలేక కుటుంబ అభివృద్ధిలో వెనుకబడుతూ దారిద్య్రాన్ని అనుభవిస్తూ జీవితాలను గడిపేవారు. కాని ప్రస్తుతం ప్రభుత్వ పాలనలో విద్యకు ప్రధాన పీఠం వేయడం వలన ప్రతి ఒక్కరూ చదువుకొనే అవకాశం కలిగిందన్నారు. కాని ప్రభుత్వం అందించే సదుపాయాలే కాకుండా పాఠశాలలో చదివి భవిష్యత్తులో మంచి స్థానంలో నిలబడి అదే పాఠశాల అభివృద్ధికి చేస్తున్న ఉచిత సేవలు నిజంగా అభినందనీయమన్నారు.
ఎన్ఆర్ఐ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరామ్‌ను కొనియాడారు. విదేశాలలో పలు ప్రదేశాలలో ఉంటున్న మన ప్రాంతపు ఎన్ఆర్ఐలను గురించి వారియొక్క ఆర్థిక సహాయంతో అనేక పాఠశాలలో కొత్త విధానాల ఏర్పాటుకు కృషి చేస్తున్నారన్నారు. అందులో భాగంగా లింగరావు పాలెం గ్రామానికి చెందిన ఆలోకం శ్రీరామమూర్తి (శ్రీరామ్) మండలంలోని 12 ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్ క్లాసు రూములను ఏర్పాటు చేశారన్నారు. శ్రీరామ్ తల్లిదండ్రులను అమరయ్య, వెంటక లక్ష్మిలను అభినందించాలన్నారు.
ఎన్ఆర్ఐ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరామ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను డిజిటలైజేషన్ చేయాలన్నదే ఎన్ఆర్ఐల లక్ష్యమన్నారు. దీనికోసం ఎన్ఆర్ఐలు కృషి చేస్తామన్నారు. విశాఖపట్టణం జిల్లాలో 300 పాఠశాలలకు డిజిటలైజేషన్ అందించి ఎన్ఆర్ఐ సేవలు అందిస్తున్నామన్నారు. అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి కూడా కృషిచేస్తామన్నారు. నూతన రాజధాని కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న కృషికి తోడుగా ఎన్ఆర్ఐలు తమ వంతు తోడ్పాటు అందిస్తామన్నారు. కోమటి జయరామ్, శ్రీరామ్, వారి తల్లిదండ్రులను, నల్లపనేని చలపతిరావులను ప్రత్యేకంగా శాలువాలతో సత్కరించారు. డిజిటల్ క్లాస్ రూంలను ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా యంఎల్సి కరణం బలరాం, యంఎల్సి రామకృష్ణ, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యయులు, విద్యార్థులు పాల్గొన్నారు.













