చంద్రబాబు పర్యటన ఎన్నారైలకు ఉత్సాహం ఇచ్చింది – జయరామ్ కోమటి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటన ఎన్నారైలకు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చిందని ఎన్నారై టీడిపి నాయకుడు, అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న జయరామ్కోమటి అన్నారు. గతంలో కన్నా ఈసారి ఎన్నారై తెలుగువారితో చంద్రబాబు నాయుడు ఎక్కువసేపు గడపడం వల్ల వారు తెలుగుదేశం పార్టీకి, రాష్ట్ర ప్రగతికోసం చేస్తున్న సేవా కార్యక్రమాలను తెలియజేశారని చెప్పారు. ముఖ్యమంత్రి కూడా ఎన్నారైలను ప్రోత్సహించేలా మాట్లాడి, ప్రభుత్వపరంగా కావాల్సిన సహాయ సహకారాలను అందిస్తామని చెప్పడం ఎన్నారై తెలుగువారిని ఎంతో ఆకట్టుకుందని చెప్పారు. ముఖ్యమంత్రి పర్యటన ముగిసిన తరువాత ఆయన ‘తెలుగు టైమ్స్’ న్యూస్ ఎడిటర్ గోవిందరాజన్తో మాట్లాడుతూ పలు విషయాలు చెప్పారు.
ఈసారి ముఖ్యమంత్రి పర్యటనలో ముఖ్య విశేషాలేమిటి?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈసారి జరిపిన అమెరికా పర్యటనలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. ముఖ్యంగా అమెరికాలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ ఎన్నారైలకు వారధిగా ఉంటూ కార్యకలాపాలను చేస్తున్న ఎపిఎన్ఆర్టీ, ఎన్నారై టీడిపి కలిసి సంయుక్తంగా ఈ పర్యటనను విజయవంతమయ్యేలా కృషి చేశాయి. దాంతోపాటు న్యూజెర్సిలో ముఖ్యమంత్రితో జరిగిన మీట్ అండ్ గ్రీట్ సమావేశానికి దాదాపు 4వేల మందికిపైగా తరలివచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో, అమరావతి రాజధాని నిర్మాణంలో పాల్గొనాల్సిందిగా ఆయన ఇచ్పిన పిలుపుకు ఎంతోమంది ఎన్నారైలు స్పందించారు.
20ఏళ్ళ క్రితం ఆయన హైదరాబాద్లో సైబర్టవర్స్ను ప్రారంభించిన రోజే ఈ సమావేశానికి ఆయన రావడం యాధృచ్ఛికమే. అలాగే కొత్త సాంకేతిక పద్ధతులను ఉపయోగించి ప్రభుత్వపరమైన సేవలను ప్రజలకు ఎలా అందిస్తున్నది చెప్పటం కూడా ఎంతోమందిని ఆకట్టుకుంది.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశంలోనే రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని చెప్పి, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనువైన వాతావరణాన్ని ఆయన మరోసారి అందరికీ తెలియజేశారు.
ఐక్యరాజ్యసమితి వేదికగా ముఖ్యమంత్రి తెలుగులో ప్రసంగించి తెలుగుభాష ప్రాశస్త్యాన్ని ఇనుమడింపజేశారు. తెలుగువారి శక్తిని ప్రపంచానికి చాటారు.
ఇంకా ఏమైనా సూచనలు చేశారా?
ఎన్నారైలకు ఓటు హక్కు లభించినందువల్ల వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపుకోసం ప్రతి ఎన్నారై కార్యకర్త కృషి చేయాలని ఆయన సూచించారు. పార్టీ గెలుపుకోసం ఎన్నారై టీడీపి, ఎపిఎన్ఆర్టీ కలిసి చేసే కార్యక్రమాలు, ప్రణాళికలను ఆయన అడిగి తెలుసుకున్నారు. కొంతమంది కార్యకర్తలు ఇదే సమయంలో పార్టీ విజయంకోసం తాము చేస్తున్న కార్యక్రమాలను ముఖ్యమంత్రికి తెలియజేశారు.
ఎపి జన్మభూమి లక్ష్యసాధన ఎంతవరకు వచ్చింది?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనమేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎపి జన్మభూమి ద్వారా డిజిటల్ తరగతుల ఏర్పాటును ముమ్మరం చేశాము. దాదాపు 5 వేల పాఠశాలల్లో డిజిటల్ తరగతులను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. అందులో దాదాపు సగానికిపై పైగా ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతులను ఏర్పాటుచేసి ప్రారంభించడం జరిగింది. మిగిలిన పాఠశాలల్లో కూడా త్వరలోనే డిజిటల్ తరగతులను ఎన్నారైల సహకారంతో ఏర్పాటు చేస్తాము.
ఎన్నారై టీడిపి కార్యకర్తలకు మీరిచ్చే సందేశమేమిటి?
గత ఎన్నికల్లో అమెరికా నుంచి ఎంతోమంది కార్యకర్తలు ఎన్నారై టీడిపి తరపున పార్టీ ప్రచార కార్యక్రమంలో ముమ్మరంగా పాల్గొన్నారు. మరికొంతమంది సామాజికమాధ్యమాలను ఉపయోగించుకుని పార్టీ గెలుపుకు కృషి చేశారు. బ్రింగ్ బాబు బ్యాక్ అన్న నినాదం గత ఎన్నికల్లో ఎన్నారైలు సృష్టించిందే. ఈసారి కూడా ప్రజలను ఆకట్టుకుని పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఎన్నారై టీడిపి కార్యకర్తలు కృషి చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా మేము కీలకపాత్ర వహించి పార్టీని అధికారంలోకి తీసుకువస్తాము.













