విద్యార్థులపై వేధింపులు ఆపేలా చర్యలు తీసుకోవాలి : కంభంపాటి
ఉన్నత విద్య కోసం అమెరికాలోని విశ్వవిద్యాలయంలో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులను అక్కడి అధికారులు వేధిస్తున్నారని, దీనిపై దృష్టి సారించాలని కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్రావు లేఖ రాశారు. సంబంధిత విద్యార్థులపై వేధింపులు ఆపేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. నకిలీ వర్సిటీలో చేరారంటూ పలువురు విద్యార్థులను అరెస్టు చేయడంతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. అమెరికాలోని ఇతర వర్సిటీల్లో చేరడానికి వీరంతా అర్హులేనని ఆయన వివరించారు. ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి విద్యార్థులకు న్యాయం చేయాలని సుష్మాస్వరాజ్‌కు కంభంపాటి విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై భారత్‌లోని ఆ దేశ రాయబారి కెన్నెత్ జస్టర్‌కు కూడా ఆయన లేఖ రాశారు.













