సీఎం చంద్రబాబు అమెరికా పర్యటన షెడ్యూలు విడుదల
అమెరికాలోని ఆపిల్ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించనున్నారు. అక్కడ ఆ సంస్థ ఉన్నతాధికారులతో విస్తృత చర్చలు జరపనున్నారు. ఆపిల్ సీఈవో టిమ్ కుక్‌తోనూ భేటీ అవుతారని సమాచారం. ఇదింకా ఖరారు కావాల్సి ఉంది. తిరుపతికి ఆపిల్‌ను తీసుకురావాలని ప్రయత్నిస్తున్న చంద్రబాబు, అమెరికా పర్యటన సందర్భంగా ఆ దిశగా చర్చలు జరపనున్నారు. వారం పాటు అమెరికాలో పర్యటించచడానికి ఆయన గురువారం బయలుదేరి వెళుతున్నారు. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి తెల్లవారుజామున 4.30 గంటలకు ఎయిరిండియా విమానంలో ఆయన అమెరికా బయలుదేరుతారు. అప్పటి నుంచీ వారం పాటు బాబు బిజీ షెడ్యూలను ఖరారు చేశారు.
ఈ పర్యటనలో చంద్రబాబు అమెరికాలోని వంద అగ్రశ్రేణి సంస్థల సీఈవోలతో పాటు ఇతరత్రా కంపెనీల ఉన్నతాధికారులతోనూ సమావేశం కానున్నారు. ఆపిల్ కార్యాలయానికి వెళ్లి అక్కడ ఆ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జెఫ్ విలియన్స్, ఆపరేషన్స్ విభాగం ఉపాధ్యక్షులు సబీఖాన్, ఐఫోన్ ఆపరేషన్ ఉపాధ్యక్షులు ప్రియ బాలసుబమ్రనియమ్. కార్పొరేట్ గవర్నమెంట్ అఫైర్స్ విభాగాధికారి కాతో ఫాస్టర్‌తో సమావేశమవుతారు. ఆపిల్ సీఈవో టిమ్ కుక్‌తోనూ చంద్రబాబు చర్చలు జరిపే అవకాశాలున్నాయి. గూగుల్ కార్యాలయంలో ఆ సంస్థ ఉన్నతాధికారులతోనూ భేటీ అవుతారు. ఆ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్‌తో చంద్రబాబు భేటీ కానున్నారు. గూగుల్‌కు చెందిన ఆల్ఫాబీట్ అధ్యక్షులు ఎరిక్ ఎమర్సన్, ఫ్లెక్సాట్రానిక్స్ సీఈవో మైక మెక్‌నమరా, ఒరాకిల్ సీఈవో మార్క్హర్డ్ తదితరులతో సమావేశం అవుతారు. స్టాన్ఫోర్డు విశ్వవిద్యాలయం అధికారులనూ కలుస్తారు. అయోవా విశ్వవిద్యాలయంలో విత్తనాభివృద్ధి కేంద్రాన్ని చంద్రబాబు సందర్శిస్తారు. ఆ వర్సిటీ కర్నూలులో ఏర్పాటు చేయబోయే విత్తనాభివృద్ధి కేంద్ర పథకం పనుల గురించి చర్చిస్తారు. ఏపీ ఎన్ఆర్టీ నిర్వహించే ప్రవాసాంధ్రుల సదస్సులోనూ చంద్రబాబు పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలి సీఈవో జాస్తి కృష్ణకిశోక్ ఈ పర్యటన కార్యక్రమలను పర్యవేక్షిస్తున్నారు.













