AAA: ఎఎఎ మొదటిరోజు వేడుకలు… అద్వితీయం
పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియా (Phildelphia) ఎక్స్ పో సెంటర్లో ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) మొదటిసారిగా భారీ ఎత్తున నిర్వహించిన మహాసభల వేడుకలు తొలిరోజు అంగరంగవైభవంగా జరిగింది. తొలిరోజు వేడుకలతోనే ఎఎఎ తనదైన మార్క్‌ను చూపించింది.
ఎంతోమంది సెలబ్రిటీలు, రాజకీయనాయకులు, వివిధ రంగాల ప్రముఖులతో మొదటిరోజు వేడుక వైభవంగా జరిగింది. మార్చి 28వ తేదీ సాయంత్రం వచ్చిన అతిధులకు ఘనమైన స్వాగతసత్కారాన్ని నిర్వాహకులు అందించారు. బాంక్వెట్ డిన్నర్ నైట్ కి సుప్రీమ్, ఎలైట్, ప్రీమియం అంటూ 3 రకాల సీటింగ్ ఏర్పాట్లు చేసి అందరి ప్రశంసలను నిర్వాహకులు అందుకున్నారు. సెలెబ్రిటీలు, స్టార్స్ అందరికీ అందుబాటులో ఉండేలా ఈ సీటింగ్ ఏర్పాట్లు చేయడం ఆకట్టుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన ప్రదేశాలను తెలియజేసేలా రూపొందించిన బస్సు ముందు ఎంతోమంది ఫోటోలు దిగేందుకు ఉత్సాహం చూపించారు. అలాగే ఎఎఎ పేరుతో ఏర్పాటు చేసిన కటౌట్ ముందు కూడా పలువురు ఫోటోలు దిగారు.
వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. తొలుత వ్యాఖ్యాతగా ఉన్న లోహిత్ కుమార్, లక్కీశర్మ తమదైన వ్యాఖ్యానాలతో సభను ఆకట్టుకున్నారు. తరువాత మిర్చి భార్గవి యాంకరింగ్ చేస్తూ అందరినీ అలరించారు.
కార్యక్రమాల్లో భాగంగా హీరోయిన్లను, హీరోలను వేదికపైకి పిలుస్తూ వారిచేత బహుమతులను అందింపజేశారు. కన్వెన్షన్ ను పురస్కరించుకుని ఎఎఎ నిర్వహించిన పోటీల్లో విజేతలకు ఈ కన్వెన్షన్ లో బహమతులను అందించారు. తరుణ్, సుశాంత్, ఆది సాయికుమార్, సందీప్‌కిషన్ తదితరులు వేదికపైకి వచ్చారు. హీరోయిన్లు దక్ష, రుహానీ శర్మ, కుషిత, ఆనంది తదితరులు మొదటిరోజు వేడుకల్లో మెరిశారు. వీరితోపాటు కాలిఫోర్నియాలో ఉంటున్న జోశర్మ కూడా అందరినీ ఆకర్షించారు.
కార్యక్రమాల్లో భాగంగా ఎఎఎ ఫౌండర్ హరి మోతుపల్లిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎఎఎ మొదటిసారి ఇంతపెద్దఎత్తున కన్వెన్షన్ జరిపిందంటే అందుకు కారణం అందరి సహకారంతోనే అన్నారు. తన ఒక్కడి విజయం కాదని, ఎఎఎలో ఉన్న అందరూ దీని వెనుకాల ఉన్నారని చెప్పారు. తరువాత నేషనల్ ప్రెసిడెంట్ బాలాజీ వీర్నాల మాట్లాడుతూ, ఈ కన్వెన్షన్ విజయంకోసం ఎంతోమంది శ్రమించారని అందరికీ ధన్యవాదాలని చెప్పారు.
ప్రెసిడెంట్ ఎలక్ట్ హరిబాబు తూబాటి మాట్లాడుతూ, ఊహించినదానికన్నా ఇంతమంది వచ్చి కన్వెన్షన్ ను విజయవంతం చేసిన ఎంతోమంది పెద్దలకు, అతిధులకు, వలంటీర్లకు, కమిటీ సభ్యులకు ధన్యవాదాలను తెలియజేశారు.
ప్రముఖ దర్శకుడు సందీప్ వంగాను స్టేజిమీదకు పిలిచినప్పుడు హాలంతా చప్పట్లతో దద్దరిల్లిపోయింది. ఆయనను ఎంతోమంది అభిమానులు పలకరించి ఉత్సాహంగా ఆయనతో ఫోటోలను దిగారు. అలాగే ఇతర దర్శకులు శ్రీనువైట్ల, వీరభద్రం తదితరులు కూడా స్టేజిమీదకు వచ్చారు.
వచ్చిన అతిధులకోసం తొలుత స్నాక్స్ లాంటి వంటకాలను అందించారు. డిన్నర్లో మాత్రం షడ్రసోపేతమైన ఆంధ్ర వంటకాలను, ఇతర పంచభక్ష్యపరమాన్నాలను వడ్డించారు. చివరన నిరవల్ బ్యాండ్ లైవ్ మ్యూజిక్ జరిగింది.







