ఇది అత్యంత దారుణమైన ఘటన : గుటెర్రెస్
ప్రపంచవ్యాప్తంగా జాత్యాహంకార ధోరణికి అంతం కావాల్సి ఉందని ఐక్యరాజ్యసమతి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ తెలిపారు. తెగలతో తలెత్తే వివక్ష నిజానికి ఈ ప్రపంచానికి ఓ నిజమైన మహమ్మారి లేదా ఫ్లేగు వంటిదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని అంతా కలిసి తుదముట్టించాల్సి ఉందన్నారు. అమెరికాలో నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్‌పై పోలీసుల దమననీతి, ఆయన విషాదాంతాన్ని ఐరాస నేత ప్రస్తావించారు. ఇది అత్యంత దారుణమైన ఘటన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుత కరోనా వైరస్ ప్రబలం దశలో నిరసనలు వ్యక్తం కావడం వంటివి ఆందోళనకర పరిణామాలు అన్నారు. రేసిజంపై ఆయన గత వారం జరిగిన టౌన్‌హాల్ మీటింగ్‌లో వెలువరించిన వ్యాఖ్యలను ఇప్పుడు విడుదల చేశారు. జాత్యాహంకార ధోరణిని ఖండిస్తూ తాజాగా ఆయన రాసిన లేఖ ప్రతులను ఐరాస సిబ్బందికి పంపిణీ చేశారు.
తెగల వివక్ష అమెరికాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉందని, ఇటువంటి వివక్షతను అరికట్టేందుకు వీలుగా పలు నిబంధనలు చట్టాలు ఉండనే ఉన్నాయని, అయితే ఈ వివక్ష, వేధింపులు, అధికార దర్పం వంటి వాటిని అరికట్టే విషయంలో మనం ఏ మేరకు సరైన విధాంగా వ్యవహరిస్తున్నామనేది ప్రశ్నార్థకం అని తెలిపారు. ఇది దేశాల ప్రభుత్వాల పరిధిలోనే కాకుండా, ప్రపంచ సంస్థల స్థాయిలో కూడా తలెత్తిన అవలక్షణం అని సృష్టం చేశారు.













