ప్రతి అమెరికన్ కు 2,000 డాలర్లు నెలనెలా ఇవ్వాలి : రోఖన్నా ప్రతిపాదన
కరోనావైరస్ యొక్క ప్రతికూల ఆర్థిక ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అమెరికన్లకు ఒక సంవత్సరంపాటు స్థిరమైన ఆదాయాన్ని ఇవ్వడానికి ప్రతినెలా 2,000డాలర్లు ఇవ్వాలని కాలిఫోర్నియాకు చెందిన డెమొక్రాట్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా ప్రతిపాదించారు. ఇటీవల వైట్ హౌస్ ఏర్పాటు చేసిన కరోనావైరస్ సలహా మండలి ‘ఓపెనింగ్ అప్ అమెరికా ఎగైన్ కాంగ్రెషనల్ గ్రూప్’ లో సభ్యుడైన రో ఖన్నాతోపాటు ఒహాయో సభ్యుడు టిమ్ ర్యాన్ కూడా ఈ ప్రతిపాదనకు మద్దతు ఇచ్చారు. వీరిద్దరూ కాంగ్రెస్లో ఎమర్జెన్సీ మనీ ఫర్ పీపుల్ యాక్ట్ ను ప్రవేశపెట్టారు. కనీసం ఒక సంవత్సరంపాటు అయినా అమెరికన్లను ఆర్థికంగా ఆదుకుంటేనే కరోనా ఇబ్బందుల నుంచి బయటపడుతామని వారు పేర్కొన్నారు. 16 సంవత్సరాలు దాటిన వారందరికీ నెలా 2,000డాలర్లు ఇవ్వాలని, దంపతులకు 4,000 డాలర్లు ఇస్తే వారి ఆర్థిక పరిస్థితి బాగుపడుతుందని చెప్పారు. పిల్లలు ఉన్నవారికి ఒక్కో చిన్నారికి మరో 500 డాలర్లు అదనంగా ఇవ్వాలని వారు సూచించారు. ఆదాయం లేనివారికి, నిరుద్యోగులుగా ఉన్నవారికి ఈ సహాయం ఎంతో మేలు చేస్తుందని వారు చెప్పారు.













